Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్ కల్లోలం... మానవ పతనమే కలి వ్యూహం, మేల్కొనండి

Advertiesment
కరోనా వైరస్ కల్లోలం... మానవ పతనమే కలి వ్యూహం, మేల్కొనండి
, గురువారం, 19 మార్చి 2020 (19:45 IST)
భవిష్య పురాణం, భాగవతాది గ్రంథాలలో మన మహర్షులు కలి వ్యూహాలను అతను ఎక్కడ ఎప్పుడు ఎలా భగవద్వేషాన్ని పెంచుతాడో, శివకేశవులు లేరు, యజ్ఞయగాదులు వృధా, ఇంద్రియ సుఖాలు పొందటం కంటే మానవునికి ఉన్న అత్యున్నత లక్ష్యమింకేముందని ? వితండవాదాలను ఎలా ప్రసారం చేయగలడో దానికి తోడ్పడగల వివిధ సిద్దాంతాలు ఎలా విస్తరిల్లుతాయో, వివరంగా హెచ్చరించారు.
 
సరే ఇక్కడ ఆయన పోరాట వ్యూహాన్ని చూద్దాం. కొందరు తినటం సుఖించటం అనే ఎండమావులవెంట పరిగెత్తేలా చేసి ధర్మం వైపు తలెత్తి చూడనివ్వడు కలి. ఇక్కడ ధర్మాన్ని అనుసరించే వారిలో కామ క్రోధాదులు రెచ్చగొట్టి, మనసును విషయవాంఛలమీదకు తిరిగేలా చేస్తాడు. ఈ తాకిడికి తట్టుకోలేని వారు మొగ్గదశలోనే తమ సాధనలు వదలి జారిపోతారు. 
 
ఇంకా కొద్దిమంది సాధకులు పైకెదగగానే వారి చుట్టూ స్వార్ధపరమైన ఆలోచనాపరుల గుంపులను చేర్చి, వారి భావాలతో కలుషితమైన మనస్సుతో ఆసాధకుడు క్రమంగా కామినీ, కనకాలపట్లనో కీర్తి కాంక్షలపట్లనో అనురక్తుడయి తల్లకిందులుగా పల్టీలు కొట్టుకుంటూ పాతాళానికి జారేలా చేస్తాడు. 
 
నేలపై నడుస్తూ పడ్డవాణ్ణి గూర్చి అందరికీ పెద్దగా తెలియదుగాని కొండమీదనుంచి దొర్లినవాణ్ని గూర్చి మాత్రం పెద్దచర్చ జరుగుతుంది. వాడి ఖర్మగాలి వాడుపడ్డాడని అనరు. వాడికెంత బలుపో అంటారు. ఇక వాడు పదిమందిని నడిపే వాహనచోదకుడైతే నమ్ముకున్నవాళ్లంతా నట్టేటమునుగుతారు.
 
కాబట్టే యత్యాశ్రమము వంటి అత్యున్నత వ్యవస్థలో కఠినమైన నిబంధనలు విధించారు పెద్దలు. అతడు వస్తు సంచయనం చేయరాదు. అరచేయి పళ్ళెంగా ఎక్కడ దొరికినది అక్కడ ఎప్పుడు లభించినది అప్పుడు మాత్రమే స్వీకరించాలని. స్త్రీలను తమ సాన్నిధ్యంలో ఉండనీయరాదు. ఎక్కడా మూడుపూటలకంటే [చాంద్రాయణ వ్రతంలో తప్ప] నిదురించరాదనే నియమాలు ఏర్పరచారు.
 
ఎప్పుడైతే యత్యాశ్రమాన్ని ఆశ్రయించినవారు పెద్దలమాటలను పక్కన బెట్టడమో లేక తమ మానసిక శక్తిపైన అతినమ్మకంతోనో తాము చేయబోయే సత్కార్యములకొరకని డబ్బు సేకరించిపోగేయటం, తమ నివాసాలని శాశ్వతంగా ఉండేలా చేయడం, భగవత్ కార్యక్రమాలకు పాల్గొనవచ్చో స్త్రీలను ఆశ్రమాలలో బస చేయనీయడం, వారితో ఎక్కువగా సంభాషించడం వంటివి చేస్తారో అప్పుడు "కలి" తన ప్రభావాన్ని చూపుతాడు. 
 
బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లా సంచయనం చేసిన ధనం కోసం, వదిలివేసిన బంధువర్గాలో... అభిమానులో చేరికూర్చుంటారు. ఇక వీరిద్వారా మిగతావారు చేరుతారు. వెరసి ఏ సంసారాన్నైతే వదలుకుందామని సన్యాసాన్ని స్వీకరించారో ఇంకో రూపంలో అది చుట్టూ చేరుతుంది. ఇక భగవంతుని తాము దర్శించేందుకు వెచ్చించాల్సిన సమయము మిగతా వాటిపై ఖర్చుచేసి తమ సాధనాశక్తి వృధాఅయి స్వయంకృతాపరాధంగా పతనమవుతుంటారు.
 
ఇక తినే ఆహారం, ధనార్జన కోసం తిరిగే ఊళ్లూ, ఎన్నడూ లేని కొత్త అలవాట్లు ఇలా అన్నీ కలిసి కొత్త రోగాలకు బాటలు వేస్తాయి. ఇది కూడా కలి కారణమే. అలాంటి ఆలోచనలు, పెడదోవ పట్టి అధోగతికి దారితీసే పరిస్థితులను కల్పించడంలో కలి సిద్ధహస్తుడని పురాణాల్లో చెప్పబడింది. కనుక కొత్త ఒక వింత పాత ఒక రోత అనేది పక్కన పెట్టి పూర్వీకులు ఆచరించిన ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తే సరి... లేదంటే కొత్తకొత్త వ్యాధులు ఇలా కరోనా రూపంలో పంజాలు విసరక మానవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారికి కరోనా వైరస్ పోటు... దర్శనం నిలిపివేత