బుద్ధిని నమ్మవద్దు - పరమాత్ముని నమ్ముకో...!!!
, సోమవారం, 17 అక్టోబరు 2011 (10:44 IST)
మనిషి స్వభావం చాలా విచిత్రం. మళ్ళీ, మళ్ళీ తప్పు చేసి క్షమించమని, దేవుడిని వేడుకుంటాడు. ఇది సరియైన పద్దతి కాదు. దేవుడు ఇలాంటివారిని క్షమించడు. 'దేవా క్షమించు' అని కోరేది జనులకు స్వాభావికం, కానీ ఆ ప్రార్థనలో వుండే అంతరార్థం మనకు బోధపడలేదు. మనిషి తాను చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకూడదు. మనం మన బుద్ధి బలాన్నుపయోగించి పరమాత్మను పొందవలెనని ప్రయత్నం చేస్తాం. ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. ఏ బుద్ధికి పరమాత్మ యొక్క అస్తిత్వంలో సంశయముందో అట్టి బుద్ధితో పరమార్థాన్ని ఎలా గ్రహింపగలం? ఒక దొంగవాడు ప్రతిసారి దొంగతనం చేసి శిక్ష అనుభవించుచున్నాడు. అతడొక్కసారి పండరీ పురంలో దొంగతనం చేసి పట్టుపడగా అతన్ని కోర్టులో హాజరుపరిచాడు. అప్పుడతడు న్యాయాధిపతితో "తమరు మేధావులు. మీకంతా తెలుసు. అపరాధిని కాదని నిర్ణయింపవలసినది"గా విన్నవించుకొన్నాడు. న్యాయాధిపతి వివేకం గలవాడై యున్నందున అతని విన్నపంలోని బుద్ధి చాతుర్యమును కనుగొని, మరియు ఆ దొంగ వానితో ఇట్లన్నారు - "సర్వ బుద్ధులకు సాక్షియగు పరమాత్మయే నిన్ను శిక్షింపవలసినదిగా నా బుద్ధిని ప్రేరేపించినాడు. అదేవిధంగా నీకు శిక్ష విధించుచున్నాను" అని తీర్పు చెప్పెనట! కాబట్టి బుద్ధిబలంచే ఒక మనిషని మోసగించ లేకపోయినప్పుడు పరమాత్మను ఎలా మోసగింపగలం? అందువల్ల మన బుద్ధిని నమ్మకూడదు. పరమాత్మను నమ్ముకోవాలి. ఎన్ని పురాణ ప్రవచనాలు విన్నా మసస్సుకు శాంతి లభించడం లేదు. ఏదైనా సాధన అవశ్యంగా చెయ్యాలి. ఆచరణ అత్యవసరం. భగవన్నామం తీసుకోండి. అది సౌభాగ్య తిలకం వంటిది.