శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు.
ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుషు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు.
మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మీ రూపంగాదలిచి గౌరవిస్తారు.
పూజా విధానం..
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను ముందురోజే మహిళలు సిద్ధం చేసుకోవాలి. శ్రావణమాసంలో రెండో శుక్రవారం రోజున వేకువ జామునే నిద్రలేచి, కాలకృత్యాలను ముగించుకుని అభ్యంగన స్నానం ఆచరించి వరలక్ష్మీ మాతను పూజించాలి. ముందుగా బియ్యంతో నింపిన కలశాన్ని నూతన వస్త్రంతో కప్పి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ కలశానే్న లక్ష్మీమాత ప్రతిమగా భావించాలి. పూజపైనే మనసును కేంద్రీకరించి వ్రతాన్ని నిష్టగా ఆచరించాలి.
వ్రతం చేసే ముందు గణపతిని ధ్యానించి భక్తిశ్రద్ధలతో పూజించాలి. గణపతి పూజ ముగిసిన తర్వాత వరలక్ష్మీ నోము ప్రారంభించాలి. ఆచమనం చేశాక కలశ పూజతో వ్రతం ఆరంభమవుతుంది.
అమ్మవారి కలశంపై పసుపు, కుంకుమ, పూలు ఉంచి ఆవాహనం చేయాలి. ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం మహాలక్ష్మికి ధ్యానం, అర్ఘ్యం, పాద్యం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉపవీతం, గంధం, అక్షతలు, పుష్పం, అధాంగ పూజ, ఆభరణాలు, ధూపం, దీపం, నైవేద్యం, నమస్కారం, పానీయం, తాంబూలం, కర్పూర నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ, తోరపూజ, వాయనం ఇవ్వడం వంటివి పూర్తి చేయాలి.
వరలక్ష్మీ అష్టోత్తర శతనామాలు, సహస్ర నామాలు జపించితే మరీ మంచిది. వాయనం ఇచ్చిన తర్వాత కథ చదివి అక్షతలను శిరసుపై ఉంచుకోవాలి. వ్రతం సందర్భంగా చుట్టుపక్కల ముత్తయిదువలను పిలిచి వాయనాలు ఇవ్వాలి. ఈ సందర్భంగా ముత్తయిదువలను ‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం’ అని పరస్పరం అనుకోవాలి. ‘ఇచ్చేది లక్ష్మి.. లక్ష్మి స్వీకరించుగాక.. లక్ష్మీ స్వరూపిణులైన మా ఇద్దరిలో ఉన్న లక్ష్మికి నమస్కారం’ అనే భావనే వాయనం ఇవ్వడంలో పరమార్థం.
సామాజిక సంబంధాలు వృద్ధి చెందేందుకే ఇలా వాయనాలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. వరలక్ష్మీ వ్రత కథ విన్నా, వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినా, వ్రతం చేసేటపుడు ప్రత్యక్షంగా చూసినా సకల సౌభాగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.