రోహిణి నక్షత్ర కారులకు కళ్ళే ప్రత్యేక ఆకర్షణ!
, శుక్రవారం, 15 జూన్ 2012 (16:07 IST)
రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకు కళ్ళే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సౌందర్యవంతమైన శరీరము, ఇతరులను ఆకర్షించే శరీరఛాయ, శరీరాకృతి కలిగివుంటారు. అయితే ఈ జాతకులు చిన్న విషయాలకు కూడా వెంటనే అలగటం, కోపించే స్వభావం కలిగివుంటారు. బుద్ధి ఆలోచన కంటే మానసిక ఆలోచనకే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహం కోసం ఏమైనా చేస్తారు. అలాగే ఎవరితోనైనా విరోధం కలిగితే ఆ శత్రువులను సర్వనాశనం చేయుటకైనా వెనుకాడరు. తాను చేసిన పనులకు ఇతరులకు చెప్పి గర్వపడే ఈ జాతకులు... చాలావరకు సత్యాన్నే పలుకుతారు. క్రమపద్ధతిలో జీవించిన యెడల అనేక కార్యములందు విజయం సాధిస్తారు. అధికమైన ఆత్మాభిమానం వలన వీరు సర్వరంగములందు ఆధిపత్యము చెలాయించగలరు. వ్యాపారంగానీ చేసినట్లైతే గౌరవము, విజయము కలుగును. వీరి స్వతంత్ర, తొందరపాటు బుద్ధి అడుగడుగున అనర్ధాలకు దారితీయును. రోహిణి ఒకటో పాదమందు జన్మించిన జాతకులు కోపము కలిగించే మాటలు పలికేవారుగా ఉంటారు. ధైర్యంలేనివారుగా ఉంటారు. రోహిణి రెండో పాదములో జన్మించిన జాతకులు పొడవాటి శరీరం, సత్యవాదిగా జీవిస్తారు. రోహిణి మూడో పాదములో జన్మించిన జాతకులు గుణవంతులుగా, సత్యవాదిగా సుఖానుభవాలు కలవారుగా ఉంటారు.రోహిణి నాలుగో పాదములో జన్మించిన జాతకులు ధనికులుగా ఉంటారు. ఇతరుల మనస్సు తెలుసుకుని ప్రవర్తించేవారుగా ఉంటారు. ఈ నక్షత్రములో జన్మించిన స్త్రీలు సౌశీల్యాది గుణములు కలవారే కాని ఆడంబరము కొంచెం ఎక్కువ. గృహజీవితమందు పరాజయం పొందక అందరినీ మెప్పించెదరు. వీరికళ్ళకు ప్రత్యేకమైన అందము ఉండును. కుటుంబీకుల స్నేహం పొందుతారు. భర్తృభాగ్యం సంతాన భాగ్యం వీరికి ఉండును. ఈ నక్షత్రము వివాహం, ధనం కూడబెట్టడానికి, దేవాలయ నిర్మాణం మొదలగు శుభకార్యములకు చాలా మంచిది. రోహిణి నక్షత్ర జాతకులు ఆరుద్ర, పుష్యమి, మఖ, స్వాతి, మూల, పూర్వాషాఢ నక్షత్ర జాతకులతో ఎటువంటి విషయాలు పంచుకోవడం మంచిది కాదు. అలాగే ఈ నక్షత్రములందు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. రోహిణి నక్షత్రమును పాదదోషము కలదు. తొలి పాదములో జన్మించిన జాతకుల మేనమామకు, రెండో పాదమున తండ్రికి, మూడో పాదమున తల్లికి దోషమున్నది. తప్పకుండా జ్యోతిష్యులను సంప్రదించి శాంతి చేయించడం మంచిది.