కర్ర విరగ్గూడదు.. పాము చావకూడదు.. ఏమిటి మార్గం..?
కర్ర విరగ్గూడదు.. పాము చావకూడదు.. ఇలా ఉంది కేంద్రం పరిస్థితి. ప్రత్యేక తెలంగాణా తుట్టెను కదిలించి.. దాని ధాటికి అల్లాడుతోంది. తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేసింది మొదలు రాష్ట్రంలో దీక్షలు, బంద్‌లు, బస్సు దహనాలు.. ఇలా రాష్ట్రం రావణకాష్టాన్ని తలపిస్తోంది. దేశంలోనే ఎంతో ప్రశాంతంగా... అభివృద్ధిపథంలో ముందుకు దూసుకుపోయే ఆంధ్రప్రదేశ్‌కు నేడు అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో తలెత్తిన సంక్షోభంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. విడిపోదామనేవారు ఎంతమంది ఉన్నా సమైక్యంగా ఉండాలనేవారు సగానికి పైగా ఉన్నట్లు తేలిపోయింది. ఇక తెలంగాణా జిల్లాల్లో సైతం కొంతమంది నిర్లిప్తంగా ఉన్నప్పటికీ వారు కూడా సమైక్యానికే మొగ్గు చూపుతున్నారని సమైక్యవాదులు ఢంకా బజాయించి చెపుతున్నారు. అయితే ఇదంతా వట్టి ట్రాష్ అని తెలంగాణా వాదులు కొట్టిపారేస్తున్నారు. మరి వారి వాదాన్ని సమర్థిస్తున్న ప్రజలు ఎంతమంది...? అసలు విడిపోతే లాభమెవరికి...? కలిసుంటే నష్టమేమిటి...? అనే ప్రశ్నలపై రాష్ట్ర ప్రజానీకం చర్చించుకోవడం కనబడుతోంది. ఈ సంగతి ఇలా ఉంటే... కేంద్ర ప్రకటనతో తెలంగాణా రాష్ట్రం వచ్చినట్లేనని తెరాస అధినేత పదేపదే చెపుతుండటంతో సీమాంధ్ర ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వారి ఆగ్రహానికి అనేక ఆస్తులు ధ్వంసమైపోతున్నాయి. మరోవైపు బంద్‌లు, నిరసనలతో ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతోంది. గతవారానికి ముందు ఇదే పరిస్థితిని తెలంగాణా ప్రజలు అనుభవించారు. రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య భగ్గుమంటున్న జ్వాలలను అదుపులో పెట్టాల్సిన కేంద్రం, ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న ఆందోళనలో ఉన్నట్లు కనబడుతోంది. సమస్యను తేల్చకుండా కొంతకాలం సాగదీస్తే పరిస్థితి సద్దుమణుగుతుందన్న భావనలో కేంద్రం ఉన్నట్లు కనపిస్తోంది. కానీ తద్విరుద్ధంగా రాష్ట్రంలో రోజురోజుకీ దీక్షలు, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ త్వరితగతిన ఫుల్‌స్టాప్ పెట్టే దిశలో కేంద్రం యత్నించకపోతే ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి సంగతేమోగానీ, సామాన్య మానవుడు మాత్రం రోడ్డున పడటం ఖాయం.