Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రలో అసలేం జరుగుతోంది...?!!

ఆంధ్రలో అసలేం జరుగుతోంది...?!!
FILE
ఉద్యమాలు నడిపేది నాయకులా...? ప్రజలా...? ఆంధ్రలో అసలేం జరుగుతోంది...? ఈ ప్రశ్నలు సామాన్య మానవుడి మదిని తొలుస్తున్నాయి. పొట్ట చేతపట్టుకుని రోజు గడిచేందుకు ఎదురు చూసే సగటు వ్యక్తికి గత కొద్ది రోజులుగా ఆయా రాజకీయ పార్టీలు బంద్‌లకు పిలుపునివ్వడం, హార్తాళ్లు, రాస్తోరోకోలు, విధ్వంసాలు.. మాది తెలంగాణా.. మాది సమైక్య ఆంధ్ర అంటూ గొంతెత్తి పొలికేకలు వేస్తున్న రాజకీయ నాయకులు.... ఇలా వీటన్నిటినీ చూస్తూ ఏం చేయాలో తెలియని చేతకానివాడిలా... ఒక ప్రేక్షకుడిగా మిగిలాడు సామాన్యుడు. అసలు తెలంగాణా, ఆంధ్ర వివాదం ఎప్పటిది..? దీని లోతుల్లోకి వెళితే చాలా విషయాలు మన కళ్లముందు కదిలాడుతాయి. ఇదొక 3డి సినిమాలా అనిపిస్తుంది.

అభివృద్ధి- వెనకబాటుతనం ఫలితం...
దేనికైనా అభివృద్ధే మూలం. ఏ దేశ చరిత్ర తీసుకున్నా పెత్తందార్లు, పెట్టుబడిదారులు తమ పబ్బం గడుపుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు సాగించినట్లు తెలిపే ఉదారణలు కోకొల్లలు. అమెరికా, చైనా, జపాన్, రష్యా.. ఇలా ఏ దేశాన్నైనా తీసుకోండి. డబ్బున్నవాడిదే రాజ్యం. లేనివాడిని అణగదొక్కే ప్రయత్నం.. లేదా బానిసలుగా చేసుకునే విధానం ఉంటుంది. అదే ఇండియాలోనూ ఉంది.

100 ఏళ్లకుపైగా మన దేశాన్ని విదేశీయులు పరిపాలించారు. ఎందుకు..? ఇక్కడి వనరులు బాగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని వారి దేశాల్లో వస్తువులు తయారుచేసి దాన్ని మళ్లీ మనలాంటి దేశాలకు అమ్మి సొమ్ము చేసుకోవడంకోసం. ఇదొక వ్యాపార చక్రం. అలా వనరులను ఉపయోగించుకుంటూ బ్రిటిషువారు, ఫ్రెంచ్ వారు, ఈస్టిండియా కంపెనీలు వంటివి సైతం కొంతమేరకు మన దేశాన్ని కొల్లగొడుతూనే అభివృద్ధి చేశాయి. అదే మనలోని కొందరు మేధావులను ఆలోచింపచేసింది. దాంతో తిరుగుబాటు మొదలైంది.

మనల్ని దోచుకుంటున్నారు. హీనంగా చూస్తున్నారు. బానిసలుగా మారుస్తున్నారంటూ... గాంధీ, నెహ్రూ, తిలక్, చంద్రబోస్.. ఇలా ఎందరో ప్రజల్లోనుంచి వచ్చి ప్రజలను చైతన్యవంతులను చేశారు. అలాపుట్టిన ఉద్యమాలే నిలబడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చింది. ఆ క్రమంలో దేశంలోని రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

తెలంగాణా సమస్య ఇప్పటిదా....?
ఇక మన రాష్ట్రాన్ని తీసుకుంటే... నవాబుల కాలం నుంచే తెలంగాణా నినాదం ఉంది. అయితే మదరాసు నుంచి తెలుగు మాట్లాడేవారికోసం భాషప్రాతిపదికన రాష్ట్రాన్ని తమకు ఇవ్వాలని అప్పటి పరిస్థితులరీత్యా కంకణం కట్టుకుని ఎందరో పోరాటాలు చేశారు. అలా ఆనాడు జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అదీ ప్రజల్లోనుంచే... ఆ పోరాటంలో పొట్టిశ్రీరాములు అమరులయ్యారు. దాంతో పాలకులు దిగి రాక తప్పలేదు. దీనికి స్వచ్చందంగా అప్పటి నాయకులు ముందుకు వచ్చి నడిపారు.

కానీ అప్పటికీ హైదరాబాదు నవాబుల పాలనలోనే ఉంది. వారి నుంచి హైదరాబాదును కేంద్రం 1947లో తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసింది. కానీ మా తెలంగాణాను ఎవరో వచ్చి శాసించడం ఇష్టం లేదనే వాదన అప్పట్లోనే మొదలైంది. అయితే ఆ అసంతృప్తులను పాలించిన అధికార పక్షాలు ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చాయి.

కానీ ఈ సమస్య తీవ్రతరం అవుతుందనే ఉద్దేశ్యంతో అప్పట్లో పెద్ద మనుషుల ఒప్పందం ఒకటి జరిగింది. దాని ప్రకారం ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతంవారైతే, ఉపముఖ్యమంత్రి తెలంగాణావారు ఉండాలనేది నియమం. దాన్ని కొన్నాళ్లు పాటించారు. ఆ తర్వాత మారిన రాజకీయ కారణాల రీత్యా తెలంగాణా ప్రజలకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం 12 సూత్రాలను విధించింది.

దాని ప్రకారం 2:1 నిష్పత్తి ప్రకారం తెలంగాణాలో ఉద్యోగాలు ఉండాలి. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయంలోనూ ఇది వర్తించాలి. దీనికి తెలంగాణా నుంచి నలుగురు, ఆంధ్ర, రాయలసీమ నుంచి నలుగురు ప్రముఖులతో నాడు ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం తెలంగాణా మిగులు తెలంగాణాకే ఖర్చు చేయాలనేది ప్రధాన సూత్రం. ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, దామోదరంతోపాటు మరో ఇద్దరు ఉండగా, తెలంగాణ నుంచి చెన్నారెడ్డితోపాటు మరో ముగ్గురు సభ్యులుగా కేంద్రం నియమించి తెలంగాణా అభివృద్ధికి తోడ్పడమని సూచించింది. కానీ వాటిని కొన్నాళ్లే అమలు చేశారు. మినహా దీర్ఘకాలం చేయలేకపోయారు. ఇదంతా ఆనాటి కొందరు స్వార్థ రాజకీయనాయకుల వల్ల ఒప్పందం అనే మాటకు అర్థమే లేకుండా పోయింది.

శాశ్వత పరిష్కార మార్గం ఏదీ...?
ఇక అప్పటినుంచి ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న దాటవేత విధానంతో తెలంగాణాకు అన్యాయం జరిగి పోతుందనే వాదన వెలికి వచ్చింది. కాలక్రమేణా ముఖ్యమంత్రులు మారడంతోపాటు తమ పదవులను కాపాడుకోవడానికి వేసిన ఎత్తులు జిత్తులతో తెలంగాణా సమస్య నానాటికీ పెరుగుతూ వచ్చింది. తెలంగాణా అభివృద్ధి చేస్తానన్న చెన్నారెడ్డి వంటి నాయకులే చేయలేక పోయారు. ఆ తర్వాత తెలంగాణా సమస్య తెరపైకి వచ్చినవెంటనే.. హిందూ- ముస్లిం గొడవలు వాటంతట అవే పుట్టుకొచ్చేవి. వీటి వెనుక ఉన్న అసలు కారణాలను ప్రజలు తెలుసుకోవడంతో ఆ గొడవల ఊసే లేకుండా పోయాయి.

ఇక 2004 ఎన్నికలతో కొత్తగా టిఆర్ఎస్ అనే పార్టీ కూడా ప్రజల ముందుకు వచ్చింది. ఈ పార్టీతో తెలంగాణా ప్రాంతంలో చంద్రబాబుకు చెక్ పెట్టొచ్చన్న ఉద్దేశ్యంతోనే ఇది ఒక అస్త్రంగా వచ్చిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. మొత్తమ్మీద ఎన్నేళ్లు గడిచినా తెలంగాణా సమస్య మాత్రం అలానే ఉంది. తెలంగాణా జిల్లాల్లో చాలామటుకు ఫ్లోరైడ్ సమస్య నెలకొని ఉంది.

ఉన్న కొద్ది వ్యవసాయం సాగు చేయడానికి ఇప్పటికీ నీటి సౌకర్యం లేదు. దాన్నుంచి అధిగమించడానికి అప్పటిముఖ్యమంత్రి వైఎస్ జలయజ్ఞం పేరుతో అన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణాలోనూ రకరకాల ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత రాయలసీమలోని ఖనిజ సంపదను తన బంధువులకు అప్పగించారనీ, భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయనపై విపక్షాలు ధ్వజమెత్తాయి. ఏది ఎలా ఉన్నా విధివశాత్తూ ఆయన దుర్మరణం పాలయ్యారు. దీంతో రాష్ట్ర పరిస్థితులు మారిపోయాయి.

తెలంగాణా వచ్చినా.. రాకపోయినా ఒరిగేదేమీ లేదు
మొత్తంగా విశ్లేషిస్తే.. అటు తెలంగాణాలోకానీ, ఇటు ఆంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రజల్లోగానీ ఉద్యమాలు చేసే తీరిక ఎవరికీ లేదు. తెలంగాణాకు కసరత్తు జరుగుతున్నాయని కేంద్రం ప్రకటించగానే అప్పటివరకూ స్తబ్దుగా ఉన్న నాయకులు ఒక్కసారిగా రాజీనామా లేఖాస్త్రాలతో ముందుకు వచ్చారు. అయితే ఇదంతా ప్రజలపై ఉన్న ప్రేమతో కాదని రాజకీయ పండితులు వాదిస్తున్నారు. ఒకవేళ వాటిని ఆమోదిస్తే.. వెంటనే వారంతా రాజకీయ నిరుద్యోగులవుతారు. అందుకే బెదిరించి తమను తాము కాపాడుకోవడంకోసం చేస్తున్న ఎత్తుగడగా వారు అభివర్ణిస్తున్నారు.

నిజానికి తెలంగాణా వచ్చినా, రాకపోయినా ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అలనాడు పెద్దమనుషుల ఒప్పందంతోపాటు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకువచ్చిన 610 జీవో అమలు చేస్తే చాలు. తెలంగాణావారికి ఉద్యోగాల్లో, ఇతర రంగాల్లో ప్రాధాన్యం దక్కుతుంది. కేంద్రం చెప్పినట్లు 2:1 నిష్పత్తి వస్తుంది. దీనివల్ల ప్రజలకు ఏమీ ఇబ్బంది లేదు. ఎవరి ఆస్తులు ఎక్కడివక్కడే ఉంటాయి. ప్రాంతాలమధ్య విభజన రేఖలు ఉండవు.

అయితే ఎవరికీ ఇబ్బంది అని చూస్తే.. కేవలం రాజకీయ నాయకులకే అంటున్నారు విశ్లేషకులు. కోట్ల రూపాయలు వెచ్చించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్థలాలు కొనడం, ఇతర వ్యాపారాలకు కోట్ల రూపాయలను వెచ్చించడంతో తాము ఆర్థికంగా దెబ్బతింటామనే మినహా సామాన్యుడిపై ఏ కోశానా ప్రేమే లేదని వారు విశదీకరిస్తున్నారు.

ఆర్థికమే ప్రధాన కారణం...
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే... స్థానిక ప్రాబల్యం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఒక వీధి కుక్క మరో వీధికుక్కను రానీయదు. ప్రకృతిలో ఎన్నో జీవరాసులకు ఇదే సూత్రం. పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్లు.. ఆర్థికంగా నిలబడ్డవాడే దేన్నైనా సాధిస్తాడు. ఆస్ట్రేలియాలో మనవారిని చంపేస్తున్నారంటే.. మీ వల్ల మాకు ఉద్యోగాలు పోతున్నాయనేది ప్రధాన కారణంగా ప్రధానమంత్రి కార్యాలయం విశ్లేషించింది. అదేవిధంగా దుబాయ్‌లోనూ ఆర్థిక సంక్షోభం కారణమై వెళ్లినవారు వెనక్కి వచ్చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఆర్థికం...

ఆ ఆర్థికమే మన సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది... ఆర్థికంగా నిర్మాతలకు, హీరోలకు బాగా డబ్బు వచ్చే ప్రాంతం... నైజాం, సీడెడ్. ఆ తర్వాత ఆంధ్ర. అంతా సవ్యంగా ఉన్నప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు వివాదం వచ్చేసరికి చిరంజీవిని నైజాం, సీడెడ్ ప్రాంతాలవారు నిలదీస్తున్నారు. దీనికీ ఆర్థికమే కారణం...

ఏది ఏమైనా రాజకీయనాయకుల వల్ల యువత భవిష్యత్ నాశనమవుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో మన దేశ స్వాతంత్ర్యంకోసం పోరాడే ఉద్యమం కాదనీ, రాజకీయ నాయకుల ఉన్నతికి.. పోరాడుతున్నట్లుగా ఉన్నదని తలపండిన మేధావులు విశ్లేషిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu