అవినీతి టేపులు: 2జీ స్పెక్ట్రమ్‌లో కొత్త కోణాలు.. నీరా రాడియా సంభాషణలు!
నాలుగేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన 2 జీ స్పెక్ట్రమ్ స్కామ్ ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించింది. వేలం విధానాన్ని కాదని, నిబంధనలన్నీ చాపచుట్టి నచ్చినవారికి అడ్డగోలుగా స్పెక్ట్రమ్ లెసైన్స్‌లు సంతర్పణచేసి దేశ ఖజానాకు లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిన ఉదంతమది. అందులో సైడ్ షోగా వెల్లడైందే నీరా రాడియా టేపుల వ్యవహారం. టాటా, రిలయన్స్ సంస్థలకు కార్పొరేట్ లాబీయిస్టుగా ఉంటూ పలువురు పారిశ్రామికవేత్తలతో, రాజకీయ నాయకులతో, జర్నలిస్టులతో నీరా రాడియా సాగించిన సంభాషణలు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని మించి సంచలనాన్ని కలిగించాయి.మూడేళ్ల వ్యవధిలోనే రూ. 300 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన నీరా రాడియా గురించి ఆరా తీయమని, ఆమె ఫోన్‌పై నిఘా పెట్టి ఉంచమని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖనుంచి ఆదాయపు పన్ను శాఖకు అందిన ఆదేశాల పర్యవసానంగా ఈ టేపులు తయారయ్యాయి. ఇవన్నీ పలు సందర్భాల్లో, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆమె సాగించిన ఫోన్ సంభాషణల రికార్డులు. ఆమె గురించిన ఆరా అవసరమని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులు భావించకపోయినా, 2జీ స్పెక్ట్రమ్ స్కాం బయటపడకపోయినా నీరా రాడియా బహుశా ఇప్పటికీ దేశ రాజధానిలో చక్రం తిప్పుతుండేవారు. అయితే, కేవలం ఆమె ఆదాయ వనరుల ఆనుపానులను కనుక్కోవడానికి మాత్రమే పరిమితం కావాల్సిన ఈ నిఘా వ్యవహారం చాలా దూరం నడిచింది. ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయంలో నాలుగు గోడలమధ్య ఉండి పోవాల్సిన సంభాషణలు బజారుకెక్కాయి.నీరా రాడియా టేపుల్లోని అంశాలు కేవలం వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితమైలేవని, అందులో అవినీతి పొరలున్నాయని, ఉన్నతస్థాయిలో సాగుతున్న కుమ్మక్కు వ్యవహారాలున్నాయని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వ్యక్తిగత సంభాషణలను మాత్రం పరిహరించి, మిగిలినవన్నీ బయటపెట్టాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పర్యవసానంగా ఈ టేపుల్లో ఉన్నవాటిలో 8,000 సంభాషణలను రాయించి తీసుకురావాలని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండు నెలల్లో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించమని సీబీఐని ఆదేశించారు. మరి అవినీతి టేపుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.