నరేంద్ర మోడీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే : డిగ్గీరాజా
, సోమవారం, 12 ఆగస్టు 2013 (16:39 IST)
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని అన్నారు. ఎన్డీయే హయాంలో తెలంగాణ ఎందుకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన నవభారత యువభేరీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొని కాంగ్రెస్ తీరును ఎండగట్టిన విషయం తెల్సిందే. ఈ విమర్శలపై దిగ్విజయ్ సింగ్ సోమవారం స్పందించారు. ఆదివారం జరిగిన నవభారత యువభేరిలో నరేంద్ర మోడీ ఒబామా కొటేషన్లను వినియోగించారని, అంటే మోడీ మరో నకిలీ ఒబామాగా పేర్కొనవచ్చన్నారు. తెలంగాణపై బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందన్నారు. ఎన్డీయే హయాంలో తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీఎన్జీవోలు సమ్మెకు వెళ్లవద్దని, ఆంటోనీ కమిటీకి తమ సమస్యలను చెప్పుకోవచ్చన్నారు. ఏదేనా సమస్యల ద్వారానే పరిష్కారమవుతుందన్నారు.