గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు : పీఠం మళ్లీ నరేంద్ర మోడీదే!!
, బుధవారం, 31 అక్టోబరు 2012 (09:26 IST)
ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్న ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకటి. ఈ ఎన్నికల పోలింగ్ నవంబరు నెలలో పలు దశల్లో జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రస్తుతం ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ (సీఎస్‌డీఎస్) సహకారంతో సీఎన్‌ఎన్ - ఐబీఎన్ ఛానెల్ ముందస్తు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తాజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఏమాత్రం తిరుగులేదని ఈ సర్వే వెల్లడించింది. దీంతో ఆయన ముచ్చటగా మూడోసారి పార్టీని ముందుండి గెలిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారని పేర్కొంది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది ఓటర్లు మోడీకి జైకొట్టారు. 36 శాంతం మంది మాత్రమే కాంగ్రెస్ పక్షాన నిలిచారు. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి 2007లో జరిగిన ఎన్నికల్లో 49 శాతం ఓట్లతో మోడీ నేతృత్వంలోని బీజేపీ 117 సీట్లు గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 38 శాతం ఓట్లు తెచ్చుకోగా, ప్రస్తుతం రెండు శాతం ఓట్లు అది కోల్పోనుందని ఐబీఎన్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో పేర్కొంది.