శబరిమల తొక్కిసలాటపై కేరళ ప్రభుత్వం ఒక సమగ్ర నివేదికను తయారు చేసి ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి గురువారం సమర్పించింది. ఈ నివేదికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోరకలికి కారకులెవరో తేల్చాలని ఆదేశించింది. ఇరుకైన మార్గంలో ఆటో రిక్షాను జీపు ఢీకొనడం వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని కేరళ ప్రభుత్వం, శబరిమల దేవస్థాన కమిటీ నివేదికలో పేర్కొనడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
ఈ నివేదికను కేరళ డీజీపీ జాకబ్ పున్నోసీ, దేవస్థానం బోర్డు అధికారులు కోర్టుకు వెళ్లి బిరాధాకృష్ణన్, గోపీనాథన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన డివిజన్ బెంచ్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా శబరిమలకు వచ్చే భక్తుల రక్షణ పట్ల దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
ఆటోరిక్షాను జీపు ఢీకొనటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సర్కార్ ఆ నివేదికలో పేర్కొంటూ, ఈ ఘోరకలిలో తమ వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేదని, తొక్కిసలాట జరిగిన వెంటనే స్పందించామని సమర్థించుకుంది. భద్రత కోసం అవసరమైన పోలీసులను ఏర్పాటు చేశామని, వాహనాల సంఖ్య లెక్కకు మించి పార్కింగ్ చేయటంతో పాటు ఇరుకు దారి వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నివేదికలో పేర్కొంది.
అంతకుముందు పులిమేడు కొండ ప్రాంతంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 102 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనపై కేరళ హైకోర్టు స్పందించి, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, అటవీశాఖ, దేవస్థానం బోర్డు అధికారులు ఈనెల 20వ తేదీలోపు ఒక నివేదికను సమర్పించాలని సోమవారం ఆదేశించింది. ఇందులోభాగంగా గురువారం కేరళ ప్రభుత్వం, దేవస్థాన అధికారులు నివేదికను సమర్పించారు.