కేంద్ర మంత్రివర్గ విస్తరణ మరో రెండుమూడు రోజుల్లో చేపట్టే అవకాశం ఉంది. ఈ కొత్త క్యాబినెట్‌లో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకు కేబినెట్ మంత్రి పదవిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశంపై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సోమవారం సాయంత్రం సమావేశమై చర్చించిన విషయం తెల్సిందే.
దీంతో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఈ వారంలోనే జరగడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. అయితే, విస్తరణ ఎపుడన్నదే ఇపుడు అందరిముందు ఉన్న సస్పెన్స్. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలి, పార్టీ పదవులను ఎవరికి కట్టబెట్టాలన్న అంశంపైనే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లు ఎడతెరిపి లేకుండా చర్చలు జరిగాయి. అయినప్పటికీ.. శాఖల కేటాయింపుపై ఒక స్పష్టతకు రాలేక పోతున్నారు.
ఈ నేపథ్యంలో, మన్మోహన్, సోనియాలు మంగళవారం తుది విడత చర్చలు జరపనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, కేంద్ర మంత్రివర్గంలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి మానవవనరుల అభివృద్ధి శాఖ లేదా గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఒకదాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే, కొత్త మంత్రివర్గంలో రాష్ట్ర ఎంపీలకు కూడా కాంగ్రెస్ అధిష్టానం మంత్రిపదవుల ఆశ చూపింది. ఈ రేసులో సీమాంధ్ర నుంచి కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, కిషోర్ చంద్ర దేవ్‌లతో పాటు.. తెలంగాణ ప్రాంతం నుంచి మధుయాష్కీ, వి.హనుమంతరావు, కే.కేశవరావు, అంజన్ కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, మందా జగన్నాథం, నంది ఎల్లయ్యల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.