ఈనెల 14వ తేదీ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులో చోటు చేసుకోనున్నాయి. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గంలో తన మార్కు కేబినెట్‌ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. అందువల్ల మరో రెండు మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్‌లో మార్పులు జరిగే అవకాశమున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కూడా మార్పులు చేసిన విషయం తెల్సిందే. ఒకరికి ఒకే పదవి అనే సూత్రాన్ని పాటించాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భావిస్తోంది. దీన్ని అమలు చేసేందుకు తక్షణమే కేబినెట్‌లో కూడా భారీ మార్పులు చేయాలని భావించింది.
ప్రస్తుతం పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఏకే.ఆంటోనీ, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి కేంద్రంలో మంత్రి పదవుల్లో కూడా కొనసాగుతున్నారు. వీరికి ఏదైనా ఒక్క పదవినే కట్టబెట్టాలని భావిస్తోంది. అలాగే, ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో ఎక్కువగా యువకులకే పెద్దపీట వేయాలని కాంగ్రెస్ పద్దలు భావిస్తున్నారు.