ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ స్పష్టం చేశారు. దేశ సమైక్యతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమన్నారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే దేశంలో మరో 28 ప్రత్యేక వాదనలు పుట్టుకు వచ్చే అవకాశముందన్నారు.
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఆయన స్పందిస్తూ.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ కూడా కేంద్రం సమైక్యాంధ్రకే మొగ్గు చూపేలా నివేదికలో పేర్కొందన్నారు. తెలంగాణను ఇస్తే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 28 ప్రత్యేక డిమాండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే ప్రత్యేక వాదన బలంగా ఉందన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలను భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పరిచినప్పుడు రాష్ట్రాలను మళ్లీ ఇప్పుడు విడగొట్టాలని అనుకోవడం ఏమిటని సీతారాం ప్రశ్నించారు. అందువల్ల విభజనకు తాము వ్యతిరేకమన్నారు.