ఈ ఏడాది పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందకు కేంద్రం ఇప్పటి నుండే కసరత్తులు ప్రారంభించింది. ఈ ఎన్నికల కోసం దాదాపు 50,000 ప్యారామిలటరీ బలగాలను పాండిచ్చేరితో పాటు మరో నాలుగు ఇతర రాష్ట్రాలకు కేంద్రం తరలించనుంది.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరిలలో ఈ ఏడాది ఏప్రిల్-మే కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలలో కేంద్ర బలగాలను మోహరింపచేసే అంశంపై ఎన్నికల సంఘంతో హోంమంత్రిత్వ శాఖ ప్రాధమిక చర్చలు ప్రారంభించింది.
"ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితిని అంచానా వేసేందుకు స్వయంగా ఎన్నికల సంఘ బృందం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించనుంది. ఈ అంశంపై ఈసీ నివేదిక అనంతరం వారితో చర్చలు జరిపి భద్రతా ప్రణాళికను సిద్ధం చేస్తామ"ని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ రాష్ట్రాలలో ఎన్నికలు బీహార్ తరహాలో విడతలు విడతలుగా జరిగే అవకాశం ఉంది.