కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వారి గృహాలపై సీబీఐ దాడులు చేయడం కేవలం కంటితుడుపు చర్యలేనని భారతీయ జనతా పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతికి సంబంధించి కేంద్ర బిందువుగా నిలిచిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ కల్మాడీ నివాస గృహాలపై సీబీఐ నిర్వహించిన సోదాల వల్ల కలిగే ప్రయోజనం శూన్యమేని ఆ పార్టీ ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ పేర్కొన్నారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ అవినీతి జరిగిన కొన్ని నెలల తర్వాత సోదాలు నిర్వహించడంలో పట్ల ఎలాంటి ప్రయోజనం చేకూరబోదన్నారు. ఆలస్యంగా దాడులు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి దోషులకు తగిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. దేశ పరువు ప్రతిష్టలను మంట కలపడంతో పాటు ప్రపంచ దేశాల్లో మనదేశం అతి పెద్ద అవినీతి దేశమనే అభిప్రాయం కలిగించారని ఆయన విమర్శించారు.