2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుకున్న ప్రతిపక్షాలు జాతికి క్షమాపణ చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ డిమాండ్ చేశారు.
కుంభకోణం వెలుగు చూసిన వెంటనే తాము మంత్రితో రాజీనామా చేయించడమే కాక బాధ్యులపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటూ ప్రతిపక్షాలు విలువైన పార్లమెంటు సమయాన్ని నాశనం చేశాయని ప్రణబ్ ధ్వజమెత్తారు.
సభాసాంప్రదాయాలకు విఘాతం కలిగించిన విపక్షాలు భేషరతుగా జాతికి క్షమాపణ చెప్పి తమ తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. కాగా భాజపా మాత్రం ప్రణబ్ డిమాండ్ ను కొట్టి పారేసింది. కేంద్రం జేబు సంస్థగా మారిన సీబీఐతో దర్యాప్తును తాము అంగీకరించబోమనీ, నిజాలు నిగ్గు తేలాలంటే జేపీసీ ఒక్కటే పరిష్కార మార్గమని స్పష్టం చేసింది.