ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలలో దివంగత నేత వైఎస్సార్ సేవలు కొనియాడుతూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి వీరప్ప మొయిలీ నివేదికను సమర్పించారు.
ఆ నివేదికలో వైఎస్ జగన్ వ్యవహారశైలిని తూర్పారబట్టారు. హైకమాండ్ సూచించిన మార్గంలో కాక మరో విధంగా ఓదార్పు యాత్ర చేపట్టడంపై తొలుత హెచ్చరించామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ వాటన్నిటినీ తాము చూస్తూ ఊరుకున్నామని నివేదికలో తెలిపారు.
ఆ తర్వాత ఆగస్టు 21న కాంగ్రెస్ హైకమాండ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టంగా చెప్పినా తన సాక్షి పేపరు, ఛానల్ ద్వారా అధినేత్రి సోనియా గాంధీపైనే విమర్శలు చేశారన్నారు. అయినప్పటికీ తాము ఏమీ అనలేదనీ, చివరికి వైఎస్ జగనే తనంతట తాను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని మొయిలీ తన నివేదికలో బహిర్గతం చేశారు.