మోసపోయే వాళ్లున్నంత కాలం.. మోసం చేసే వాళ్లకి కొదవే ఉండదని చెబుతారు. ఇది చదివితే నిజమే అనిపిస్తుందేమో.. అమాయకంగా ఉంటే కన్ను మూసి తెరిచేలోపే మన దగ్గర నుంచి అన్నీ దోచేస్తారు. అలాంటిదే ఈ సంఘటన. ఒడిషా (గతంలో ఒరిస్సా)లో ఓ యువతి మరో యువతిని మోసం చేసిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అయితే చదవండి..!
ఒడిషాలోని రూర్కెలాలో మినాతీ ఖత్వా అనే 27ఏళ్ల యువతి గోల్‌ఘడ్‌లోని తన చెల్లెలు ఇంటికీ తరచూ వస్తుండే సీతాకాంత్ రౌత్రే అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ వివాహానికి మినాతీ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిద్దరు ఓ గుడిలో పెళ్లి చేసుకొని తమ వివాహాన్ని నోటరీ చేయించారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసే జీవిస్తుండే వారు. కానీ శారీరక సుఖానికి మాత్రం దూరంగా ఉండేవారు.
పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో తాను ఓ వ్రతం చేస్తున్నానని ఆరు నెలల వరకూ మనమిద్దరం శారీరకంగా కలవకూడదని సదరు అబ్బాయి చెప్పడంతో మినాతీ కూడా దానికి అంగీకరించి సరే అని ఒప్పుకుంది. ఇలా ఆరు నెలలు గడిచిపోవడంతో ఒక రోజు ఇద్దరూ కలిసి మినాతీ సొంత ఊరికి వెళ్లారు. మినాతీ బంధువులు ఆమె పెళ్లి చేసుకుంది అబ్బాయిని కాదని అమ్మాయినని అనుమానం వ్యక్తం చేయడంతో ఖంగుతినడం మినాతీ వంతైంది.
మినాతీ ఖత్వాకు ఈ విషయం తెలుసుకోవడానికి 6 నెలలకు పైగా సమయం పట్టింది. అయితే తాను ఈ విషయం గ్రహించేలోపే సదరు అబ్బాయి వేషం వేసుకున్న అమ్మాయి తట్టా బుట్టా సర్దేసింది. ఓ కారు, ఓ జీపుతో సహా మినాతీ పేరుతో బ్యాంకు నుంచి తెచ్చిన లోన్ సొమ్ముతో ఉడాయించింది. దీంతో మినాతీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగు చూసింది.