స్వాతంత్రం రాకముందు నుంచే మన దేశంలో "గాంధీ"ల పరంపర కొనసాగుతుంది. మన దేశాన్ని వారి కుటుంబమే నడిపిస్తూ వస్తుంది. కానీ సోనియా హయాం వచ్చే సరికి తాను మాత్రం ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి నిరాకరించారు. అయితే ఇలా ఎందుకు చేశారని పలువురు ప్రముఖులు పదేపదే ఆమెను ప్రశ్నించగా.. ఆ విషయాన్ని ఏదో ఒకరోజు ఓ పుస్తకం రాసి దాని ద్వారా వెల్లడిస్తానని ఆమె చెప్పారు.
గత 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యుపిఎ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రిగా దేశ పగ్గాలను మన్మోహన్ సింగ్‌కు సోనియా అప్పగించారు. సోనియా తీసుకున్న అనూహ్య నిర్ణయం పట్ల పార్టీలో సర్వత్రా విస్మయం నెలకొంది. పార్టీ క్యాడర్‌లో సోనియా నిర్ణయం తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయినప్పటికీ సోనియా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
2006లో మన దేశంలో పర్యటించిన అమెరికా అధికారికి ఒకరు సోనియాను ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఆమె సమాధానమిస్తూ.. ''చాలామంది నన్ను ఎక్కువగా ఈ విషయంపై ప్రశ్నిస్తుంటారు, వారందరికీ నే చెప్పేది ఒక్కటే, దీనిపై ఏదో ఒక రోజు పుస్తకం రాస్తాన"ని చెప్పినట్లు వికీలీక్స్ బయటపెట్టిన దౌత్య పత్రాలలో పేర్కొని ఉంది. కాలిఫోర్నియా ప్రధమ మహిళ, గవర్నర్ ఆర్నాల్డ్ షావార్జ్‌నెగ్గర్ భార్య అయిన మరియా షివర్‌కు సోనియా స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.
ప్రధానిగా తాను తప్ప వేరే ఎవరైనా ఫర్వాలేదని, తాను ఈ నిర్ణయం పట్ల ఏనాడు చింతించలేదని వారితో సోనియా అన్నట్లు తెలుస్తుంది. అయితే.. అధికారం కోసం తాను ఏనాడు ఆలోచించలేదని, రాజకీయాల పట్ల విముఖత ఉన్నప్పటికీ.. దేశంలో బిజెపి ప్రాభవం పెరుగుతుండడం, కాంగ్రెస్ బలహీనపడుతుండడం చూసి గాంధీ కుటుంబ వారసత్వాన్ని కాపాడేందుకునే రాజకీయాల్లోకి బలవంతంగా రావాల్సివచ్చిందని ఆమె పేర్కొ న్నారు.