పార్లమెంటు శీతాకాల సమావేశాల సమయాన్ని మొత్తం పూర్తిగా దుర్వినియోగం చేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణ జరిపించాలని అన్ని విపక్షాలు ముక్తఖంటంతో గగ్గోలు పెడుతున్నా.. కేంద్రం మాత్రం "నో" అనే సమాధానమే ఇస్తుంది.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా జెపిసి విచారణకు వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపించారు. దీంతో విపక్షాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) సాధారణ సమావేశంలో సోనియా భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై ధ్వజమెత్తారు. కర్ణాటకలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ యాడ్యూరప్పను ఆమె విమర్శించారు.
భూకేటాయింపుల కుంభకోణంలో ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తిరిగి అధికారాన్ని కట్టబెట్టడమేంటని ఆమె ప్రశ్నించారు. 2జీ స్పెక్ట్రమ్ వివాదంలో జెపిసి విచారణ జరిపించాలన్న విపక్షాల డిమాండ్‌పై సోనియా వివరణ ఇస్తూ.. జెపిసి అవసరాన్ని, ఎప్పుడు జరిపించాలనే విషయాన్ని పార్లమెంటరీ సలహాదారు కమిటి (పిఏసి), సిబిఐలు చూసుకుంటాయని, దీంతో పాటు సుప్రీం కోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తుందని సోనియా చెప్పినట్లు సమావేశానికి హాజరైన పార్టీ ఎంపి తెలిపారు.