మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఎసరు తెచ్చిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో కీలక పత్రాలు మాయమయ్యాయి. అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఈ పత్రాలు మాయం కావడం గమనార్హం. దీనికి సంబంధించి ఆ విభాగం కార్యదర్శి గురుదాస్ బాజ్‌పే ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మెరైన్ డ్రైవ్ పోలీసులు వెల్లడించారు.
పట్టణాభివృద్ధి విభాగం వర్గాల సమాచారం మేరకు.. ఆదర్శ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించి పది ఫైళ్లలో ఉన్న అనేక పత్రాలు మాయమైనట్టు డీసీసీ చెర్రింగ్ దూర్జీ వెల్లడించారు. ఈ పత్రాల మిస్సింగ్ విషయాన్ని సీబీఐ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్న విషయం తెల్సిందే.
కార్గిల్ యుద్ధంలో అశువులు బాసిన మృతుల కుటుంబాల కోసం ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ ద్వారా బహుళ అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించగా, రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు తమ కుటుంబ సభ్యులకు ఫ్లాట్లను కేటాయించుకున్నారు. ఇలాంటి వారిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా ఒకరు. దీంతో ఆయనను మహారాష్ట్ర సీఎం పీఠం నుంచి తప్పించారు.