గత ఐదు నెలలుగా కాశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్ల వెనుక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పోలీసులు చెపుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల్లో కొంతమంది వేర్పాటువాదులతో చేతులు కలిపినట్టు వారు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థకు వేర్పాటువాదులకు మధ్య విభేదాలు పొడచూపినట్టు వారు పేర్కొంటున్నారు.
దీనిపై కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఎస్ఎం.సాహై మాట్లాడుతూ.. గత నెలలుగా కాశ్మీర్‌లో చోటు చేసుకున్న రాళ్ళదాడి, అల్లర్లు ఆకస్మికంగా చెలరేగినవి కావని, వీటి వెనుక లష్కర్ తోయితా తీవ్రవాద సంస్థ హస్తం ఉందన్నారు. వీటికి సంబంధించి 60 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను ఆరెస్టు చేసినట్టు చెప్పారు. రాళ్ల దాడిలో వీరి పాత్ర ఉందన్నారు.
అరెస్టు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏడుగురిపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (ప్రజా భద్రతా చట్టం) కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు. అంతేకాకుండా, ఈ అల్లర్లతో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకుగాను వారి వివరాలను ఆయా విభాగాలకు పంపినట్టు ఐజీపీ వెల్లడించారు.