ముంబై మారణహోమం జరిగి రెండేళ్లు పూర్తి కానున్న (26/11) నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండు మెట్రోపొలిస్ నగరాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది.
మహారాష్ట్ర, ఢిల్లీలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ముంబై, ఢిల్లీ నగరాల్లో అదనపు బలగాలను మోహరించారు. ముఖ్యంగా ఈ రెండు నగరాల్లోని మార్కెట్లు, ప్రధాన కూడళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాలు, జన సంచారం ఎక్కువ గల ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాటుకు ఆయా నగర పోలీసు శాఖలు అప్రమత్త చర్యలు చేపట్టాయి.
కాగా.. ముంబై నగరానికి ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో ముప్పు పొంచి ఉంది. అలాగే ఢిల్లీ పల్లిక బజార్‌లో కాశ్మీరీ ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ విభాగం హెచ్చరించింది.