దేశంలో కుంభకోణాలు కాంగ్రెస్ సర్కారుని కుదిపేస్తుంటే.. కర్ణాటక రాష్ట్రంలోని కుంభకోణాలు బిజెపి సర్కారు కుదిపేస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యాడ్యూరప్పను వివాదాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఒక వివాదం సద్దుమణిగేలోపు మరో వివాదం ఆయనను చుట్టుకుంటోంది.
తాజాగా వెలుగు చూసిన భూ వివాందం యాడ్యూరప్ప సర్కారుకు గండి కొట్టేదిలా ఉంది. ఈ వివాదంలో ఆయనకు ఉచ్చు మరింత బిగుసుకుంటుంది. భూ కుంభకోణంపై ప్రతిపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కె.ఎస్.ఈశ్వరప్ప, మంత్రులు కట్టా సుబ్రమణ్యంనాయుడు, ఆర్.అశోక్, శోభా కరంద్లాజె తదితరులపై రోజుకో రకమైన ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో నెలకొన్న ఈ విపరీత పరిణామాలు చూస్తుంటే.. ఈసారి ముఖ్యమంత్రి పీఠం కదిలే సూచనలు దర్శనమిస్తున్నాయి. ఏకపక్ష ధోరణితో వ్యవహరించి ఇప్పటికే 16 మంది మంత్రులను పోగొట్టుకొని మెజారిటీతో కాలం నెట్టుకొస్తున్న యాడ్యూరప్పను మార్చే విషయంపై బిజెపి కేంద్ర నాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ బృందం రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ముఖ్యమంత్రి కోటా కింద బెంగుళూరు అభివృద్ధి ప్రాధికార (బిడిఎ) నివేశన స్థలాల కేటాయింపు, కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధి మండలి (కెఐఎడిబి) భూములను ఢీనోటిఫై చేయడం, కోట్ల విలువ చేసే ఆ భూములను తక్కువ ధరలకే పారిశ్రామిక వేత్తలకు కేటాయించడం, వివిధ భూ వివాదాల్లో ఆయన కుమారులు, సోదరిలపై వస్తున్న విమర్శలు.. ఇవన్నీ యాడ్యూరప్పను ఉక్కరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇది కాస్తా.. కేంద్రం వరకూ పాకడంతో అధిష్టానం కూడా రాష్ట్రంపై దృష్టిసారించింది. వీటిపై వెంటనే వివరణ ఇవ్వాలని బిజెపిని కోరింది. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాల్సిందే.