ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్ సింగ్‌కు మద్దతు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దీంతో తృణమూల్‌పై ఇప్పటి వరకు ఉన్న సందేహం తీరిపోయింది.
ఈ విషయంపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. ఆయన అభ్యర్థిత్వానికి మేం పూర్తి మద్దతు ఇస్తాం. ఆయన మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తే.. బెంగాల్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తారని మేం ఆశిస్తున్నాం అని మమతా అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రధానితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నపుడు మమతా వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్-కాంగ్రెస్ కూటమికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీతో సహా ఇతర పార్టీలకు ఓటు వేయవద్దని ఆమె సూచించారు. ముఖ్యంగా బెంగాల్‌లో మార్పును కోరుకునే ప్రతి ఒటరు తమ కూటమికి ఓటు వేయాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.