వామపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య కుదిరే పొత్తు క్లీన్‌స్వీప్ చేసేదిలా ఉండాలని బెంగాల్ అగ్గిబరాటా మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాల్లో తమ కూటమి విజయభేరీ మోగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ దిశగానే కూటమి మధ్య సీట్ల సర్దుబాటు, చర్చలు సాగుతాయని మమతా చెప్పారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో అధికార సీపీఎం కూటమికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు కలిసి పని చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో వామపక్ష కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం కోసం తాము వేచిచూస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
అయితే, కాంగ్రెస్ నాయకత్వం అధిక సీట్ల కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ పార్టీ విజయం సాధించిన ఆరు స్థానాలతో సహా మరికొన్ని విజయావకాశాలు ఉన్న సీట్లను కేటాయించాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. దీనిపై ఆమె పరోక్షంగా మాట్లాడుతూ.. తాము ఏడాది మొత్తం పని చేసిన పక్షంలో అన్నిసీట్లలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.