నవంబరు 26 దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై తాము ఎటువంటి సైనికి చర్య చేపట్టబోమని భారత్ మరోమారు స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ప్రసంగిస్తూ... పాక్‌పై సైనిక లేదా దానికి సంబంధించిన ఎటువంటి చర్యను చేపట్టబోమన్నారు. అయితే కొన్ని పార్టీలు సైనిక చర్యను చేపట్టాలని ప్రభుత్వానికి సూచనలు చేశాయని చెప్పారు.
ప్రభుత్వం ఆ సూచనలను తిరస్కరించిందని ప్రణబ్ వెల్లడించారు. దాడులకు పాల్పడిన దేశాలపై బాధిత దేశాలు ప్రతీకార దాడులు జరిపిన ఉదాహరణలు లేకపోలేదనీ, గజాలో జరిగిన దాడుల ఇటుంవంటివేనని ఆయన గుర్తు చేశారు.
వందలమంది ప్రాణాలను బలితీసుకున్న ముంబయి ఉగ్రవాద దాడుల అంశాన్ని ప్రభుత్వం తనదైన శైలిలో పరిష్కరించి, పాకిస్తాన్ మెడలు వంచుతుందని తెలిపారు. ప్రాణాలను బలిగొనడం ద్వారా సమస్య పరిష్కారం కాదన్నారు. చుక్క నెత్తురు రాలిపడకుండా విజయం సాధించడం భారత్‌కు మాత్రమే తెలుసుననీ, అదే భారతదేశానికి ఉన్న అతి గొప్ప గుణమని అన్నారు.
ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు పాకిస్తాన్‌పై మరింత ఒత్తిడి తెస్తామనీ, ఇంత జరిగినా తీవ్రవాదులకు ఆతిథ్యమివ్వడాన్ని మానుకోకపోతే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకిగా మిగులుతుందని ప్రణబ్ పేర్కొన్నారు.