Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణ స్వీకారం

Advertiesment
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా గవర్నర్ వోహ్రా ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ మద్దతు సోనియా ప్రణబ్ హాజరు
FileFILE
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఒమర్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు.

ముగిసిన ఎన్నికల్లో ఎన్సీ పార్టీ 28 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెల్సిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఒమర్‌ను ఆహ్వానించారు. అయితే మొత్తం 87 సీట్లు కలిగిన అసెంబ్లీలో సాధారణ మెజారిటీ (44)ని మాత్రం సాధించలేక పోయింది. దీంతో 17 సీట్లతో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఎన్సీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

ఈ మేరకు ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర జల వనరుల శాఖామంత్రి సైఫుద్దీన్ సౌజ్, సీఎల్పీ నేత చౌదరీ మొహ్మద్ అస్లామ్‌లు తమ మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒమర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ శాసనసభాపక్షం నేతల సమావేశంలో 38 సంవత్సరాల ఒమర్ పేరును ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రతిపాదించగా, మిగిలిన అభ్యర్థులు మద్దతు తెలిపారు.

దీంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్సులో ఒమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం మధ్యాహ్న రెండు గంటలకు జమ్మూలోని జనరల్ జరావార్ సింగ్ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీలు హాజరుకానున్నారు.

ఇదిలావుండగా ఎన్సీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారు కావడంతో యూపీఏ కూటమి నుంచి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పిడిపి పార్టీ వైదొలగింది. ఈ మేరకు పిడిపి అధినాయకత్వం యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాకు లేఖ పంపింది.

Share this Story:

Follow Webdunia telugu