హింస ద్వారా ఏదీ సాధించలేరని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ మిలిటెంట్లు హింసాత్మక పంథాను వీడి జాతీయ స్రవంతిలో కలవాలని ప్రధాని పిలుపునిచ్చారు. తీవ్రవాద పంధా చేపట్టిన నా యువ స్నేహితులు హింసా మార్గాన్ని వీడి జాతీయ రాజకీయ స్రవంతిలో చేరాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు. కాశ్మీర్‌లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.
హింస ద్వారా ఏమీ సాధించలేమని మీరు తెలుసుకోవాలి. రక్తపాతం ద్వారా ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. హింస మరణాలకు, విధ్వంసాలకు మాత్రమే దారితీస్తుందని ప్రధాని కాశ్మీరీ మిలిటెంట్లకు హితవు చెప్పారు. రాజకీయం లేదా ఆర్థికం.. ఇలా ఏ సమస్య అయినా శాంతియుత పద్ధతులలో, చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని మన్మోహన్ చెప్పారు.
కాశ్మీరీ యువత భద్రతను, సౌభాగ్యాన్ని రుచి చూడలేదని తనకు తెలుసని, మీరు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించి, పాత గాయాలను మాన్పాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ , తన ప్రభుత్వం పనిచేస్తున్నాయని ప్రధాని చెప్పారు. సరిహద్దు రాష్ట్రమైన కాశ్మీర్ ప్రజల సంక్షేమానికి తమ పార్టీ, ప్రభుత్వం మనస్ఫూర్తిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లో నిరుద్యోగాన్ని తొలగించి, పరిశ్రమలు, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నొక్కి చెప్పారు.