ముంబయిలో జరిగిన తీవ్రవాద దాడులు వంటి దుశ్చర్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబయిలలో జరిగిన పేలుళ్లు మనదేశ ఆర్థికవ్యవస్థను, ప్రజల మనస్సులను పూర్తిగా గాయపరిచాయని ప్రధాని తెలిపారు.
దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఉగ్రవాదాన్ని ఐక్యం ఎదుర్కోవాలని మన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం (డిసెంబర్ 13) మన దేశ పార్లమెంట్‌పై 2001లో తీవ్రవాదులు దాడులు జరిపిన రోజు. ఈ దాడిలో తీవ్రవాదులను ఎదుర్కొని ఆసువులు బాసిన అమరవీరులకు ప్రధాని నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ తదితరులు ఢిల్లీలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం తీవ్రవాదంపై రెండు రోజుల న్యాయమూర్తుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ... దక్షిణాసియాకుతీవ్రవాదం ముప్పు పొంచి ఉండటంతో, ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడేందుకు సిద్ధం కావాలన్నారు. దేశంలోని వివిధ మతాల మధ్య విద్వేషాన్ని రగిలించడమే తీవ్రవాదులు ముఖ్య లక్ష్యమని ప్రధాని చెప్పారు.
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాల్పడే ఉగ్రవాద శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచ దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఒకే తాటిపై నడవాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. తీవ్రవాదాన్ని అంతమొందించే దిశగా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. ముంబయి దాడుల సమయంలో... తమ వంతు సైనిక సహకారాన్ని అందిస్తామని ముందుకొచ్చిన ప్రపంచ దేశాలకు ప్రధాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.