Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విలాస్‌రావ్ స్థానంలో సుషీల్ కుమార్ షిండే!

విలాస్‌రావ్ స్థానంలో సుషీల్ కుమార్ షిండే!
దేశ వాణిజ్య రాజధానిపై ఉగ్రవాదులు విసిరిన పంజాకు మహారాష్ట్ర అధికార రాజకీయ పార్టీ నేతల పునాదులు కదులుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్ర హోం మంత్రి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆయన బాటలో ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ కూడా నడిచారు.

తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు పార్టీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. విలాస్‌కు ఉద్వాసన పలకడం ఖాయమని న్యూఢిల్లీ వర్గాలు చెపుతున్నాయి. ఇందుకు సంకేతాలు కూడా వస్తున్నాయి.

కాగా, విలాస్ స్థానంలో కేంద్ర విద్యుత్ శాఖామంత్రి సుషీల్ కుమార్ షిండే పేరు ప్రముఖంగా ఉండగా, మరో కేంద్ర మంత్రి ఫృథ్విరాజ్ చవాన్‌ కూడా పోటీ పడుతున్నారు. అయితే.. షిండేకే మెరుగైన అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మహారాష్ట్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఏకే.ఆంటోనీలతో ఆమె సంయుక్తంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత పార్టీకి చెందిన సీనియర్ నేతలతో మంతనాలు జరిపి, విలాస్ భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ముఖ్యంగా ముంబైలో పేలుళ్ల ఘాతుకాన్ని ప్రజలు మరువకముందే విలాస్‌రావ్, తన కుమారుడు, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో కలిసి తాజ్‌ హోటల్‌ పర్యటనకు వెళ్ళడంతో పలు విమర్శలు చోటు చేసుకున్నాయి. తన కుమారుడు హీరోగా వర్మతో సినిమా తీసేందుకు వచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ పరిణామాలపై పార్టీ అధినేత్రి ఆగ్రహం చెంది, ఆయన్ను మార్చాలనే తుది నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. ఇదే విషయాన్ని రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ కూడా స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నేతలు, మిత్రపక్షం ఎన్సీపీతో చర్చించి మరికొన్ని గంటల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ఆంటోనీ సోమవారం మీడియాకు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu