జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ సోమవారం జరుగనుంది. మొత్తం 87 అసెంబ్లీ స్థానాల్లో తొలివిడతగా పది స్థానాలకు పోలింగ్ ఆరంభమవుతుంది. ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చనే సందేహాల నడుమ పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతోంది. ఎన్నికలు జరిగే బండిపొర, పూంఛ్, లెహ్, కార్గిల్ జిల్లాల్లో భద్రతా బలగాలు మార్చ్‌ఫాస్ట్‌ను నిర్వహించాయి.
పోలింగ్ కోసం మొత్తం 1038 పోలింగ్ బూత్‌లలో సగానికి పైగా ‘అత్యంత సమస్యాత్మక’ ప్రాంతాలుగా, మిగిలిన వాటినన్నింటిని ‘సమస్యాత్మక’ కేంద్రాలుగా ప్రకటించారు. కాగా, తొలి విడత పోలింగ్‌లో దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తొలి దశ బ్యాలెట్ పోరులో శాసనసభ మాజీ స్పీకర్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మొహమ్మద్ అక్బర్ లోనె, పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలోని మాజీ మంత్రులు ఉస్మాన్ మజిద్, నవాంగ్ రిగ్జిన్ జోరా, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు థుపస్తన్ చెవాంగ్, శాసనమండలి సభ్యుడు, పీడీపీ నాయకుడు నిజాముద్దీన్‌లతో పాటు మొత్తం 102 మంది అభ్యర్థులు సోమవారం నాటి తొలివిడత పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గత శనివారంతో ముగిసిన ఎన్నికల ప్రచార యజ్ఞం శాంతియుతంగా పూర్తయినప్పటికీ.. పోలింగ్‌కు మాత్రం ఉగ్రవాదదాడులు, భద్రతా దళాలు సేకరించిన సమాచారం ప్రకారం ఎన్నికలను భగ్నం చేసేందుకు దాడులు జరుగవచ్చని భావిస్తున్నట్లు జమ్మూకాశ్మీర్ డీజీపీ కులదీప్ ఖోడా తెలిపారు. ఇదిలావుండగా జమ్మూకాశ్మీర్‌లో కురుస్తున్న మంచు ఎన్నికల ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. కాగా, మిగిలిన 77 స్థానాలకు ఆరు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.