కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మద్దతు ఉన్నంత వరకు తన పదవికి రాజీనామా చేయబోనని కేంద్ర హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్ స్పష్టం చేశారు. పార్టీ ఆశీస్సులు ఉన్నంత వరకు మంత్రిగా కొనసాగుతున్నట్టు ఆయన తేల్చి చెప్పారు. గత శనివారం ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్ళ తర్వాత మంత్రి పాటిల్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.
ఒక వైపు పేలుళ్ళతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనై ఉంటే.. పాటిల్ మాత్రం మీడియా ముందుకు వచ్చిన మూడు సార్లూ మూడు రకాల దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇది మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. అంతేకాకుండా మంత్రి పాటిల్ వైఖరిపైనా యూపీఏ మిత్ర పక్ష పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు పదవీ గండం తథ్యమనే వార్తలు వచ్చాయి.
ఈ వార్తలకు తోడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంతర్గత భద్రతపై నిర్వహించిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశానికి కూడా హోం మంత్రిని ఆహ్వానించలేదు. అందువల్ల పాటిల్ పదవీ గండం వార్తలు ఖాయమని తేలిపోయాయి. అయితే.. ఈ ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అనూహ్యంగా పాటిల్‌కు మద్దతు తెలిపారు.
పేలుళ్ళకు ఏ ఒక్కరినో బాధ్యులను చేయడం సబబు కాదని తేల్చి చెప్పారు. గతంలో హోంమంత్రిగా అద్వానీ ఉన్నపుడు తాము కూడా పలు మార్లు ఆయన రాజీనామాకు డిమాండ్ చేయగా భాజపా తోసిపుచ్చిందని గుర్తు చేశారు. ఇదిలావుండగా తనపై వచ్చిన విమర్శలపై పాటిల్ స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మద్దతు ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పారు. రాజకీయ నాయకుల విధానాలను విమర్శించడం తప్పులేదని, అయితే వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోరాదని మీడియాకు హితవు పలికారు. పరిశుభ్రంగా ఉండటం తన అలవాటనీ, అలా ఉండటం తప్పుకాదని మంత్రి పాటిల్ అభిప్రాయపడ్డారు.