లాడెన్ ఆచూకీ తెలిపిన పాకిస్థాన్ వైద్యునికి 33 యేళ్ల జైలు!
, గురువారం, 24 మే 2012 (10:28 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ డాక్టర్ ఆఫ్రిదికి బ్రిటీష్ కాలం నాటి చట్టాల మేరకు 33 యేళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే, 3.2 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ జరిమానాను చెల్లించని పక్షంలో మరో మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఖైదర్ ప్రొవిన్స్‌లోని గిరిజన ప్రాంతంలోని కోర్టు ఆదేశించింది. ఈ వైద్యునిపై దేశద్రోహ నేరంపై బ్రిటిష్ కాలం నాటి గిరిజన చట్టాల మేరకు ఈ శిక్ష విధించారు. డాక్టర్ షకీల్ ఆఫ్రిది సీఐఏ సహకారంతో అబొట్టాబాద్‌లో బూటకపు టీకాల కార్యక్రమం నడిపి, లాడెన్ ఉంటున్న నివాసానికి వెళ్లి లాడెన్‌తో సహా వారి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించారు. వీటికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి.. ఆ నివాసంలో లాడెన్ ఉన్నట్టు అమెరికా సీఐఏ అధికారులు నిర్ధారించుకుని పక్కా ప్రణాళికతో దాడి చేసి లాడెన్‌ను హతమార్చారు. ఈ నేపథ్యంలో.. లాడెన్ మరణానికి దారితీసిన అమెరికా దాడులపై దర్యాప్తు జరుపుతున్న పాక్ కమిషన్ అసలు విషయాన్ని కనుగొని, లాడెన్ ఆచూకీ కనుగొనడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌పై దేశద్రోహ ఆరోపణల కింద విచారించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఈ కమిషన్‌కు నేతృత్వం వహించారు. కాగా ఫ్రాంటియర్ క్రైమ్స్ రెగ్యులేషన్ (ఎఫ్‌సీఆర్)గా ప్రాచుర్యంలో ఉన్న గిరిజన చట్టాల కింద అఫ్రిదీకి బుధవారం 33 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పాక్ అధికారవర్గాలు వెల్లడించాయి. బ్రిటిష్ కాలం నాటి ఎఫ్‌సీఆర్ అక్కడి గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ అమల్లో ఉంది. అఫ్రిదీని పెషావర్‌లోని ప్రధాన జైలుకు తరలించారు. మరోవైపు... ఆఫ్రిదిని తమకు అప్పగించాలని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కోరుతోంది. ఒక వైద్యుడి ఆఫ్రిది పాకిస్థాన్, అమెరికాలకు ఎంతో మేలు చేశారని, అందువల్ల తమ దేశంలో నివశించేందుకు వీలుగా ఆయనను తమకు అప్పగించాలని ఆమె కోరారు.