విద్య, ఉపాధి, సాంకేతిక రంగాల్లో భారత్, చైనా దేశాలు అత్యంత వేగంగా దూసుకెళుతున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. ఈ రెండు దేశాలతో అమెరికాను పోల్చుకుంటే ఎంతో వెనుకబడి ఉన్నామన్నారు.
ఈ పోటీపై ఆయన మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంతో పోటీపడటంలో ఆ రెండు దేశాల యువత ఎంతో చొరవ చూపిస్తున్నారన్నారు. గత సంవత్సరం నవంబర్‌లో చేసిన భారత పర్యటనలో అమెరికా ఆ దేశంతో ప్రతిష్టాత్మకమైన కొన్ని ఒప్పందాలను చేసుకుందని గుర్తు చేశారు.
వీటి వల్ల దేశంలో కొన్ని లక్షల ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. చైనా - భారత్‌తో పాటూ ఆసియా దేశాల సంబంధాల్లో ప్రముఖ పాత్రను పోషిస్తున్న రష్యాతోనూ ధృడమైన సంబంధాలను ఏర్పరుచుకున్నామ ని ఆయన తెలిపారు.
భారత - చైనా దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల అమెరికాకు దేశంలో రెండు లక్షల యాభై వేల ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. అయితే, అమెరికా పెట్టే పెట్టుబడుల కోసం కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.