బ్రెజిల్‌ను అతలాకుతలం చేస్తున్న వరదలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ వరదల కారణంగా బ్రెజిల్‌లో ఇప్పటికే 378 మంది మృత్యువాత పడ్డారు. ఈ వరద నీరు ఉధృతి అతలాకుతలం చేస్తున్న విషయం తెల్సిందే. రియో డి జెనెరో నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల సుమారు 378 మంది మృతిచెందినట్లు గ్లోబల్ న్యూస్ అనే వార్తాసంస్థ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది.
వరద ప్రభావం నోవా ఫ్రిబుర్గో, టెరెసోపొలిస్, పెట్రోపొలిస్ మున్సిపాలిటీలపై అధికంగా పడింది. ఈ మున్సిపాలిటీల పరిధిలోని ప్రాంతాలన్నీ బురదలో కూరుకుపోయాయి. వరదల వల్ల మట్టిచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వర్షాల వల్ల విద్యుత్, సమాచార వ్యవస్థకు అవరోధం ఏర్పడటంతో నష్టం ఏ స్థాయిలో ఉందో ఇంకా పూర్తిగా తెలియదని అధికారులు చెపుతున్నారు.