భారత్, పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం వచ్చే నెలలో జరుగనుంది. ఫిబ్రవరిలో భూటాన్ రాజధాని థింపూలో సార్క్ దేశాల మంత్రుల సమావేశం జరుగనుంది. ఇందులో భారత్, పాకిస్థాన్‌ల విదేశాంగశాఖ కార్యదర్శుల మధ్య చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ చర్చల ఫలితాన్ని ఆధారంగా పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి భారత్ పర్యటన ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాల తేదీలు ప్రకటించనప్పటికీ, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశముందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎస్.కృష్ణ కూడా సూచన ప్రాయంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ శాఖల కార్యదర్శుల స్థాయి చర్చలు జరగడానికి పాక్ అంగీకరించింది. గత జూలై నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషిని మన దేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశాలు అర్థవంతమైన ఫలితాలిస్తేనే తాను భారత్‌కు వెళతానని ఖురేషీ స్పష్టం చేసిన విషయం తెల్సిందే.