కనిష్క విమాన ప్రమాదంలో ప్రధాన నిందితుడు ఇంద్రజిత్ సింగ్ రేయంత్‌కు తొమ్మిదేళ్లు జైలు శిక్షను విధిస్తున్నట్లు కెనడా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పునిచ్చిన బ్రిటీష్ కొలంబియా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి మార్క్ మెక్‌ఇవాన్ రేయంత్ ఒక పశ్చాత్తాపం చెందిన వ్యక్తి అని అభివర్ణించారు.
అయితే ఈ కేసు విచారణ సమయంలో రేయంత్ ఇప్పటికే 17 నెలలు పోలీసుల కస్టడిలో ఉండటంతో అతని శిక్షలో ఈ 17 నెలలను కోత విధించారు. దీంతో రేయంత్‌కు ఏడు సంవత్సరాల ఏడు నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. ప్రాసిక్యూటర్ల వాదన ప్రకారం రేయంత్ ఉద్దేశపూర్వకంగా ఎయిర్ ఇండియా విమానంపై క్షిపణులతో దాడి చేశారని ఆరోపించారు.
జూన్ 23, 1985న అట్లాంటిక్ మహాసముద్రంపై "కనిష్క" అనే ఎయిర్ ఇండియా బోయింగ్ 747 విమానంపై క్షిపణితో దాడి చేయడంతో అది సముద్రం మీదనే కుప్పకూలిపోయింది. ఐర్లాండ్‌కు దక్షిణంగా 31,000 అడుగుల ఎత్తులో జరిగిన ఈ దుర్ఘటనలో 82 మంది పిల్లలు సహా మొత్తం 329 మంది మరణించారు. వీరిలో 280 మంది కెనడా దేశీయులు.