దక్షిణ కొరియాతో మరో యుద్ధమే చేయాల్సివస్తే ఈసారి జరిగబోయేది అణు యుద్ధమేనని ఉత్తర కొరియా తాజా హెచ్చరికలు చేసింది. ఇటీవల దక్షిణ కొరియాలోని దీవిపై ఉత్తర కొరియా శతఘ్నులతో దాడి చేయడం, మరో వైపు దక్షిణ కొరియా అణ్వస్త్ర కార్యక్రమాల కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలను సడలించడానికి ఓ వైపు దౌత్య స్థాయిలో ప్రయత్నాలు జరుగుతుండగా, ఉత్తర కొరియా ఈ ప్రకటన చేయడం గమనార్హం. దక్షిణ కొరియా అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరి, కవ్వింపు చర్యలే ఇందుకు ప్రధాన కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది.
కొరియా ద్వీపకల్పంలో యుద్ధం కొద్ది రోజుల్లోనే జరగవచ్చని ఉత్తర కొరియా తన అధికారిక వెబ్‌సైట్ ఉరిమిన్‌జోక్కిరీలో వెలువరించిన వ్యాఖ్యానంలో పేర్కొంది. 'దక్షిణ కొరియా వారి నిర్లక్ష్యపూరిత యుద్ధ విధానాల వల్ల యుద్ధమే వస్తే అది అణు యుద్ధానికే దారి తీస్తుంది. పైపెచ్చు అది కొరియా ద్వీపకల్పానికే పరిమితం కాదు' అని అది తెలిపింది.
కొరియా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ఉత్తర కొరియా అధికార పార్టీ పత్రిక ‘రోడోంగ్ సిన్‌మున్’ వ్యాఖ్యానించింది. అమెరికా ప్రభుత్వంతో అధికారికంగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని, దక్షిణ కొరియాలో ఉన్న 28,500 మంది అమెరికా సైనికులను ఉపసంహరించుకోవాలని గతంలో ఇచ్చినన పిలుపులను పునరుద్ఘాటించింది.