లంకలో మరోసారి రావణకాండ బయటపడింది. ఎల్‌టిటిఈలపై శ్రీలంక సైనికులు యుద్ధం జరిపిన సమయంలో స్త్రీ, పురుషులను నగ్నంగా చేసి కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బ్రిటన్ ఛానెల్ 4న్యూస్ ఈ ఉదంతాన్ని బయటపెట్టింది. ఈ ఆకృత్యాలకు సంబంధించిన వీడియోలను ఛానెల్ 4న్యూస్ విడుదల చేసింది.
గత సంవత్సరంలో తమిళ ఎల్‌టిటిఈపై శ్రీలంక సైనికులు యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లంక సైనికులు యుద్ధనేరాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై విచారణ జరపాలంటూ ఐక్య రాజ్య సమితి ఆదేశాలు చేసింది. తమిళ తిరుగుబాటుదారుల వర్గం ఎల్‌టిటిఈపై శ్రీలంక ప్రభుత్వం యుద్ధం ముగియగానే విజయం సాధించినట్లు ప్రకటించుకుంది.
ఈ వీడియోలో.. తమిళ ఖైదీల మృతదేహాల మధ్యన ఒక ఖైదీ కళ్లకు గంతలు కట్టి సైనికుడు షూట్ చేయడం, మరో సైనికుడి ముఖం కూడా కనిపించగా, స్వరంతో సహా వారి ముఖాలు స్పష్టంగా కనిపించాయి. సైనికులు ప్రత్యక్షంగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు మరికొన్నింటిని వీడియోలో చూపారు. గతంలో పెద్ద నిడివి కలిగిన వీడియోను ఐక్యరాజ్య సమితికి పంపారు.
ఈ తాజా వీడియోలను కూడా ఛానెల్ 4న్యూస్ ఐరాసకు పంపింది. అయితే ఈ వీడియోలను బ్రిటన్‌లోని శ్రీలంక హై కమిషన్ ఖండించింది. ఈ వీడియోలు సహజమైనవి కావని, నకిలీవని కొట్టిపారేసింది. ఇటీవల ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను మహీందా రాజపక్సే లండన్ చేరుకోగా.. అక్కడ అతనికి చేదు అనుభవం ఎదురైంది. లండన్‌లో నివసించే తమిళులు అతనికి వ్యతిరేకంగా నిరసన గళాలు విప్పడంతో భద్రతా కారణాల దృష్ట్యా రాజపక్సే తన పర్యటనను రద్దు చేసుకోవాల్సించింది.