పాకిస్థాన్‌లో భారీ విధ్వంసం తప్పిపోయింది. ఆ దేశ పార్లమెట్‌తో పాటు ప్రధాన మసీదులపై దాడులు చేసేందుకు కుట్రపన్నిన ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ వెల్లడించారు.
దీనిపై ఆయన శుక్రవారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్, భవనాలు, మసీదుల వద్ద దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లను అరెస్టు చేసినట్టు చెప్పారు. దీంతో పెను ప్రమాదం తప్పిపోయిందన్నారు.
అరెస్టు చేసిన ఇద్దరిలో ఒకరు నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్‌లోని బాన్ను పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. ఈయన సెక్టార్ ఎఫ్8/1లోని మసీదు వద్ద దాడి చేయాలని నిర్ణయించాడన్నాడు. ఈ ప్రాంతంలో విదేశీయులతో పాటు దౌత్యవేత్తలు నివశిస్తుంటారని తెలిపారు.
అయితే, ఆ దేశ అధికార వార్తా ఛానల్ జియో న్యూస్ మాత్రం ఇస్లామాబాద్ వద్ద ఇద్దరిని అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి ఆయుధాలు, ఆత్మాహుతి బెల్టును స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఈ ఇద్దరు తీవ్రవాదులను ఖాసీం మునీర్, నయీముల్లాగా గుర్తించినట్టు ఆ ఛానల్ పేర్కొంది.