ఇండోనేషియాలోని జావా ప్రాంతంలో ఉన్న మౌంట్ మెరాపీ అగ్నిపర్వత పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 283కు పెరిగింది. గత నెలాఖరులో నిప్పులు కక్కడం ప్రారంభించిన ఈ అగ్నిపర్వతం ఇప్పటికీ శాంతించలేదు. తాజాగా మరోసారి ఈ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 2,70,000 మందికి పైగా ప్రజలు ఇంకా పునరావ కేంద్రాల్లోనే మగ్గుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
"మెరాపీ మృతుల సంఖ్య 283కు పెరిగింది. 2,70,000 మందికి పైగా ప్రజలు ఇంకా తాత్కాలిక శిబిరాల్లోనే నివసిస్తున్నార"ని విపత్తు నిర్వహణ అధికారి రత్నసారి చెప్పారు. మృతుల సంఖ్య 275 నుంచి పెరిగందని ఆమె తెలిపారు. చికిత్స పొందుతున్న కొంత మంది ప్రజలు మృతి చెందగా, మరికొన్ని మృతదేహాలను అగ్నిపర్వత పరిసర ప్రాంతాల్లో గుర్తించామని ఆమె పేర్కొన్నారు.
కాగా.. అగ్నిపర్వత తీవ్రత తగ్గినట్లు ప్రభుత్వం రెండవసారి ప్రకటించడంతో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న శరణార్థులు తమ నివాసాలకు వెల్లడానికి సిద్ధమయ్యారు. మూడు లక్షలుకు పైగా శరణార్థులు తమ తమ నివాసాలకు తరలి వెళ్లినట్లు రత్నసారి తెలిపారు.