Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్భాటంగా ముగిసిన 'లక్ష్య'దీక్ష: జగన్ వ్యూహం ఫలించినట్టేనా?

ఆర్భాటంగా ముగిసిన 'లక్ష్య'దీక్ష: జగన్ వ్యూహం ఫలించినట్టేనా?
, శుక్రవారం, 24 డిశెంబరు 2010 (09:58 IST)
రైతు సమస్యల పరిష్కారం పేరుతో కడప మాజీ ఎంపీ, దివంగత వైఎస్ఆర్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 48 గంటల లక్ష్యదీక్ష ఊహించినదానికంటే విజయవంతమైంది. ప్రధాన ప్రతిపక్షంతో పాటు ప్రభుత్వ యంత్రాగం పలు ఆటంకాలు కలిగించినప్పటికీ.. జగన్ పిలుపుకు రైతులు, నేతన్నలు, సాధారణ ప్రజానీకం భారీగా స్పందించారు. దీంతో కృష్ణానదీ తీరం 48 గంటల పాటు జనసంద్రాన్ని తలపించింది. ఇది పేరుకు మాత్రం రైతు దీక్ష అయినప్పటికీ.. ఫక్తు రాజకీయ, బలప్రదర్శనను తలపించింది.

ఈ వేదిక ద్వారా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉలిక్కిపడేలా చేసింది. లక్ష్యదీక్షకు సుమారుగా 29 మంది శాసనసభ్యులు హాజరుకావడాన్ని హైకమాండ్ జీర్ణించుకోలేక పోతోంది. వీరితో పాటు... ప్రరాపా నుంచి ముగ్గురు, తెదేపా నుంచి ఒక ఎమ్మెల్యే జగన్‌కు మద్దతు తెలుపగా, ఆరేడు మంది ఎమ్మెల్సీలు సభకు విచ్చేశారు. నెల్లూరు, అనకాపల్లి ఎంపీలు జగన్‌ దీక్షలో పాల్గొని తమ మద్దతును తెలిపారు. అంతటితో ఆగకుండా జగన్‌ను కాంగ్రెస్ అధిష్టానం దూరం చేసుకోవడం దురదృష్టకరమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదేసమయంలో మరికొంతమంది కాంగ్రెస్ యువ ఎంపీలు తమ భవిష్యత్‌ ప్రణాళికలు ఎలా ఉండాలన్నదానిపై ఇప్పటి నుంచే ఆలోచనలు మొదలు పెట్టారు. జగన్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి, కింది స్థాయి కార్యకర్తలను టార్గెట్ చేసిన విషయం తెల్సిందే. దీంతో వీరిపై ఒత్తిడి పెరిగి ఎటూ తేల్చుకోలేని డైలమాలో పడ్డారు. జగన్ వైపు వెళ్లకపోతే భవిష్యత్‌లో నష్టపోతామా? అనే ఆందోళన వారిలో మొదలైంది. అందువల్లే సభకు మూడు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు హాజరైనప్పటికీ.. ఫోన్లలో మరో 30-40 మంది ఎమ్మెల్యేలు తమ సంఘీభావాన్ని తెలిపినట్టు సమాచారం. అదేసమయంలో తమతమ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ప్రజల అభీష్టాన్ని తెలుసుకునే పనిలో ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతానికి జగన్‌కు మద్దతు తెలుపుతున్న వారిలో ఎక్కువగా మాజీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఇలాంటి మాజీలు జగన్ వైపు వెళ్లడం వల్ల కలిగే నష్టమేమీ ఉండదు. ఒకవేళ 2014 లేదా అంతకంటే ముందుగా ఎన్నికలు వచ్చినా.. తమ ప్రాంతాల్లో తమకే టిక్కెట్లు లభిస్తాయనే ఊహల్లో విహరిస్తున్నారు. అందువల్ల మాజీలు ఎక్కువగా జగన్ చెంతకు చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇలాంటి వారిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలే అధిక సంఖ్యలో ఉన్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతల నుంచి జగన్‌కు పెద్దగా మద్దతు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం తెలంగాణ అంశం. రాష్ట్ర ఏర్పాటుకు జగన్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మద్దతు లభించవచ్చు. కానీ, అది జగన్‌కు అంత సులభమైన విషయంకాదు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నాయకుల్లో పెక్కుమంది చేజారిపోయే ప్రమాదం ఉంది. ఒక్క తెలంగాణ అంశం మినహా మిగిలిన ప్రాంతాల్లో జగన్ చేపట్టిన లక్ష్యదీక్ష విజయం చేకూరినట్టుగానే భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu