Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణా జిల్లా రాజకీయాల్లో జగన్మోహనాస్త్రం: నేతల్లో కలకలం!!!

కృష్ణా జిల్లా రాజకీయాల్లో జగన్మోహనాస్త్రం: నేతల్లో కలకలం!!!
, సోమవారం, 13 డిశెంబరు 2010 (11:21 IST)
కృష్ణా జిల్లా రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఈ జిల్లాలో వర్షబాధిత రైతులను పరామర్శించేందుకు కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటనతో జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. జగన్‌తో బందరు ఎమ్మెల్యే పేర్ని నాని సమావేశమై మంతనాలు జరిపారు. తాను జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తన అనుచరులతో ఆయన భేటీ అయ్యారు. దీంతో కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కరోజులోనే వేడెక్కిపోయాయి.

మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టు ఆయన సొంత జిల్లా కడపలో కన్నా వేరే జిల్లాలోనే కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో దాదాపు కాంగ్రెస్ మొత్తం జగన్ వెంబడి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఉదయం బందరు శాసనసభ్యుడు పేర్ని నాని మొదట బాంబు పేల్చాడు. తాను జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నానని చెప్పాడు. తన అనుచరులతో భేటీ అయ్యానని వారంతా జగన్‌తో వెళ్లేందుకు తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని చెప్పారు. తన అనుచరవర్గం చెప్పినట్టు నడుచుకోవాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

పేర్ని నానిని ఆదర్శంగా తీసుకున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా జగన్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు.. జగ్గయ్యపేట, నూజివీడు, మైలవరం, విజయవాడ పశ్చిమం మాజీ శాసనసభ్యులు ఉదయభాను, తాటి వెంకట ప్రతాప్ అప్పారావు, జ్యేష్ట రమేష్, జలీల్ ఖాన్, విజయవాడ మాజీ మేయర్ తాటి శకుంతల తదితరులు ఉన్నారు.

అంతేకాకుండా, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యుడు నాగేశ్వరరావుపై కూడా జగన్మోహనాస్త్రం పని చేసింది. గతంలో పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఒక్కడే జగన్ వెంట వెళతారని ఇప్పటి వరకు అందరూ భావించారు. అయితే, ఆయన వెనక్కి తగ్గగా, అనూహ్యంగా కొత్త ఎమ్మెల్యేలు ముందుకు రావడం గమనార్హం.

వాస్తవానికి పేర్ని నాని శనివారం సాయంత్రం వరకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా మంచిపేరుంది. అయితే, కృష్ణా జిల్లాలో జగన్ అడుగుపెట్టగానే.. జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాత్రికి రాత్రి చోటుచేసుకున్న హఠాత్పరిణామంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేకేఆర్ తక్షణం జిల్లాలోని సీనియర్ నేతలైన లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణులకు ఫోన్ చేసి తాజా పరిస్థితులపై చర్చించారు.

అంతేకాకుండా పేర్ని నానితో కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. జగన్ వైపే మొగ్గు చూపుతానని తేల్చిచెప్పారు. తాను జగన్ వెంట వెళ్లడానికి పదవులనో డబ్బులనో ఆశించి వెళ్లడం లేదని చెప్పారు. తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకే వెళుతున్నట్టు తెలిపారు. అయితే, మంత్రి పదవి ఇవ్వనందుకే నాని జగన్ వెంట వెళ్లడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకటనలో కృష్ణా రాజకీయాలు ఒక్కసారి మారిపోయాయి.

Share this Story:

Follow Webdunia telugu