Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం రోశయ్య శిబిరంలో జగన్ "కోవర్టులు"

సీఎం రోశయ్య శిబిరంలో జగన్
FILE
ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం దక్కదని తేలిపోయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం, ఆ తర్వాత ఆ రాష్ట్రంలోని సిట్టింగ్ ముఖ్యమంత్రులు సైతం "అమ్మ" మాటకోసం ఎదురు చూడ్డం వంటి పరిణామాలను చూసిన అనంతరం జగన్ వర్గం ఒకడుగు వెనక్కి వేసింది.

అధిష్ఠానంతో పెట్టుకుంటే పరిస్థితి మరింత దిగజారి భవిష్యత్తులో సైతం సీఎం పోస్టు గురించి మాట్లాడే అవకాశం జారి పోతుందనే నిర్ణయానికి వచ్చినవారై సోనియాగాంధీ ఏం చెపితే దానికే కట్టుబడి ఉంటామని జగన్ బహిరంగంగా ప్రకటించేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోశయ్యను వ్యూహాత్మకంగా కార్నర్ చేస్తూ, తమకు అనుకూలంగా మలచుకోవాలని జగన్ శిబిరంలోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పంతం పట్టినట్లు సమాచారం.

ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రోశయ్యకు అనుకూలంగా ఉన్నట్లు ఉంటూ అక్కడ కీలక సమాచారాన్ని జగన్ చెవిలో ఎప్పటికప్పుడు వేయడానికి కొందరు కోవర్టులు సిద్ధమైనట్లు భోగట్టా. సదరు కోవర్టులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకుని రోశయ్యపై ఎదురు దాడి చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ప్రతిరోజూ కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు వైఎస్ జగన్‌కు "టచ్"లో ఉంటూ అత్యంత గోప్యమైన సమాచారాన్ని, ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని జీవోల సారాంశాలను రాబడుతున్నట్లు వినికిడి. వాటిలో లోటుపాట్లను జగన్ క్షుణ్ణంగా మధిస్తూ... రోశయ్యపై ఎలా విమర్శనాస్త్రాలు సంధించాలి..? అనే అంశాలపై దృష్టి పెట్టినట్లు భోగట్టా.

ఇప్పటికే తన తండ్రి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని జగన్ విమర్శించిన సంగతి తెలిసిందే. మొత్తమ్మీద 2014నాటికి పూర్తిస్థాయి కాంగ్రెస్ పట్టున్న నాయకుని అవతారం ఎత్తి, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనకు సాటి మరొకరు లేరని చాటిచెప్పేందుకు వైఎస్ జగన్ ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu