కేసీఆర్‌కు లేని ఆశను చంద్రబాబు కల్పించారు... లగడపాటి
, సోమవారం, 21 జనవరి 2013 (14:20 IST)
తెలంగాణపై కేసీఆర్ ఆశలు వదిలేసుకున్న తరుణంలో చంద్రబాబు నాయుడు కొత్త ఆశలు కల్పించారని సమైక్యవాది, విజయవాడ ఎంపీ రాజగోపాల్ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని చెప్పేందుకు తన కనువిప్పు యాత్రతో చెప్పాలని ప్రయత్నించిన లగడపాటి రాజగోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చవద్దనీ, తెలుగుజాతిని ముక్కలు చెక్కలు చేయవద్దని చెప్పేందుకు ఈ పువ్వుతో చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలుకుదామని అనుకున్నానని లగడపాటి రాజగోపాల్ అన్నారు. చంద్రబాబు నాయుడు తన ముఖం నాకు చూపించలేక సిగ్గుపడుతున్నట్లు సమాచారం అందించారని సమైక్యవాది, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. దాదాపు 6 గంటల హౌస్ అరెస్టు అనంతరం వెలికి వచ్చిన లగడపాటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ స్పీచును మీడియా ముందు చదివి వినిపించారు. తెలుగుజాతి కోసం అహరహం పాటుపడిన ఎన్టీఆర్ పార్టీని కబ్జా చేసిన చంద్రబాబు ఇపుడు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతిని కలిపి ఉంచాలని ఆనాడు ఎన్టీఆర్ పాటుపడితే ఈనాడు చంద్రబాబు నాయుడు తప్పటడుగులు వేస్తున్నారని అన్నారు. దయచేసి తెలుగుజాతిని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న వేర్పాటువాదులతో చేతులు కలపవద్దని కోరారు. చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా యాత్ర పూర్తయ్యేలోపు ఖచ్చితంగా కలుస్తాననీ, పువ్వు ద్వారా తన సమైక్య గళాన్ని విప్పుతానని చెప్పారు.