తెలుగు టీవీ ఛానళ్ల "మార్గదర్శి" ఈటీవి సుమన్ కన్నుమూత
, శుక్రవారం, 7 సెప్టెంబరు 2012 (11:57 IST)
బుల్లితెర సంచలనం, తెలుగు టెలివిజన్ ఛానళ్లకు మార్గదర్శి శ్రీ చెరుకూరి సుమన్ గురువారం రాత్రి 12.18 నిమిషాలకు స్వర్గస్తులయ్యారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. పిన్న వయసులోనే బుల్లితెరపై ఎన్నో అద్భుతాలను సృష్టించిన సుమన్ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు రెండో కుమారుడయిన సుమన్ 1966 డిసెంబరు 23న జన్మించారు. ఆయనకు ఒక పాప, బాబు ఉన్నారు. ఆయన భార్య విజయేశ్వరి రామోజీ గ్రూపు సంస్థల్లో భాగమయిన డాల్ఫిన్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా సుమన్ చిన్నతనం నుంచే సృజనాత్మక దృష్టితో ప్రతి అంశాన్ని పరిశీలించేవారని ఆయన గురువు బాపు చెప్పేవారు. అమెరికాలో జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసిన సుమన్, ఈటీవీ స్థాపనతో ఎలక్ట్రానిక్ మీడియాలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. బుల్లితెరపై సీరియళ్లు, టాక్ షోలు, గేమ్ షోలు.. ఇత్యాది ఎన్నో వినూత్న కార్యక్రమాలన్నీ ఆయన సృష్టించినవే. గృహిణులకు ఏం కావాలో తెలుసుకుని వారి అభిరుచులకు తగ్గట్లు కార్యక్రమాలను రూపొందిన ఘనత ఆయనకే సొంతం. ఈ పరంపరలో ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. దేశీయ ఎలక్ట్రానిక్ మీడియాకు వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మార్గదర్శిగా నిలిచిన సుమన్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. గురువారం రాత్రి పరిస్థితి మరింత క్షీణించి కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.