మంత్రి హోదాలో ఆఫీసులోనే మోపిదేవి కుట్ర : సీబీఐ
, గురువారం, 24 మే 2012 (17:16 IST)
వాన్‌పిక్ సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో మంత్రి హోదాలోనే మోపిదేవి వెంకటరమణ తన కార్యాలయంలోనే కుట్ర పన్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకుకు సమర్పించిన మెమోలో తెలిపింది. పైపెచ్చు.. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఎస్ మాజీ అధికారి బ్రహ్మానంద రెడ్డిలతో కలిసి మంత్రి కుట్ర చేశారని ఆరోపించారు. ఇందులో.. లావాదేవీల్లో ఎనిమిది కోట్ల రూపాయల లంచం స్వీకరించినట్టు సీబీఐ ఆరోపించింది. అందుకే మోపిదేవిని అరెస్టు చేసినట్టు సీబీఐ పేర్కొంది. అనంతరం సీబీఐ మోపిదేవి అరెస్టును అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సీబీఐ పలు అంశాలను వెల్లడించింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మౌలిక వసతుల రూపకల్పన, పెట్టుబడుల శాఖామంత్రిగా పని చేసిన మోపిదేవి వాన్‌పిక్ ప్రాజెక్టుకి సంబంధించి ఇష్టానుసారం జీవోలు జారీ చేసినట్లు తమ విచారణలో తేలినట్లు పేర్కొంది.రెండో రోజు విచారణ నిమిత్తం దిల్‌కుషా అతిథి గృహానికి వచ్చిన మోపిదేవిని అరెస్టు చేశామని తెలిపింది. మంత్రిపై 120 (బి), రెడ్‌విత్ 420, 477 (ఎ), 409 పాటు 13 (1) డి, 13(2)ఆర్‌డబ్యు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మోపిదేవి అరెస్టు వివరాలను సిబిఐ అధికారులు వారి కుటుంబ సభ్యులతోపాటు.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్‌కు తెలియజేశారు. మోపిదేవి జారీ చేసినట్లుగా చెబుతున్న వివాదాస్పద జివోలలో జీవో నంబరు 29.. వాన్‌పిక్‌కు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుంచి మినహాయింపులు, జీవో నెంబర్ 30 వాన్‌పిక్‌కు రాయితీల ఒప్పందానికి ఆమోదం, జీవో నెంబర్ 31 వాన్‌పిక్‌కు భూసేకరణ ముసాయిదాకు సంబంధించి సమగ్ర ఆధారాలు సేకరించినట్లుగా సీబీఐ తెలిపింది.