చంద్రబాబు నాయుడు చిదంబరాన్ని నిజంగానే కలిశారా..?!!
, గురువారం, 3 మే 2012 (22:15 IST)
ఇప్పుడు ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. గత ఆగస్టు నెలలో ఢిల్లీ టూర్ కెళ్లిన చంద్రబాబు నాయుడు ఓ రోజు రాత్రి గంటపాటు ఎక్కడికో వెళ్లివచ్చారు. అయితే ఆయన కేంద్రమంద్రి చిదంబరాన్ని కలిసేందుకే వెళ్లారని అప్పట్లో గట్టిగానే ప్రచారం జరిగింది. బుధవారం లోక్‌సభలో నామా నాగేశ్వర రావు ప్రశ్నలకు చిదంబరం సమాధానమిస్తూ మధ్యలో చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. దీంతో చంద్రబాబు చిదంబరాన్ని కలిశారన్నది రూఢి అయ్యిందని తెరాస, ఇతర పార్టీలు గళం అందుకున్నాయి. చిదంబరంతో బాబు చేసుకున్న రహస్య ఒప్పందం ఏంటని తెరాస ప్రశ్నిస్తోంది. రెండుకళ్ల సిద్ధాంతాన్ని అమలుచేస్తూ తెలంగాణకు అడ్డుపడుతున్న తెదేపా జెండాలను పీకేయాల్సిందేనని ధ్వజమెత్తుతోంది. మరోవైపు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని హుటాహుటిని హైదరాబాదులో అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశమయ్యారు. తాను చిదంబరాన్ని కలవలేదని స్పష్టం చేశారట కూడా. ఐనప్పటికీ ఉపఎన్నికల వేళ చిదంబరం ప్రకటనతో మరోమారు తెదేపాకు పెద్ద తలనొప్పి వచ్చిపడిందని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. ఇదిలావుండగా ఈ వ్యవహారాన్ని నాగం జనార్థన్ రెడ్డితో సహా తెలంగాణ జేఏసీ సైతం ప్రశ్నిస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ అయితే బాబులో చీకటిలో చిదంబరాన్ని తాను కలవనని సందర్భం వచ్చినపుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు.