Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు ఎమ్మెల్యేలతో చిరు అత్యవసర భేటీ: బలప్రదర్శనకా?

Advertiesment
నేడు ఎమ్మెల్యేలతో చిరు అత్యవసర భేటీ: బలప్రదర్శనకా?
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ హుటాహుటిన హైదరాబాద్‌కు రావాలని కబురు పంపిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీని నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆయన మూడు గంటలకు ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమవుతారు.

ఈ మేరకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఒక ఎస్ఎంఎస్ కూడా పంపారు. సాయంత్రం మూడున్నర గంటలకు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో సమావేశమవుతారు.

ఇందులో కాంగ్రెస్ సర్కారుకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల గవర్నర్‌తో సమావేశమైన చిరంజీవి.. కాంగ్రెస్ పార్టీకి అవసరమై కోరితే కేకేఆర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం హడావుడిగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు ఎమ్మెల్యేలందరినీ రమ్మని కబురు పంపడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయింది.

కాగా, ప్రరాపాకు చిరంజీవితో కలుపుకుని 18 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాయలసీమ ఎమ్మెల్యేలు ఢిల్లీలో జగన్ దీక్షకు హాజరయ్యారు.

వీరు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అందువల్ల వీరిపై చర్య తీసుకునే అంశంపై ఈ అత్యవసర భేటీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రరాపా వర్గాలు మాత్రం పెట్రో అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నును తగ్గించాలని కోరేందుకే తాము ముఖ్యమంత్రిని కలవనున్నట్టు వివరణ ఇస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu